ఓ కొడుకు ఎంపీ, మరో కొడుకు ఎమ్మెల్యే.. ఐనా సీఎం సీటుపై ’జానా’ బెంగ..
రెండు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం.. సర్పంచ్ స్థాయి నుంచి హోంమంత్రి వరకు ఎదిగిన నేపథ్యం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టున్న నాయకుడు జానారెడ్డి.
By: Tupaki Desk | 16 Jun 2025 11:00 PM ISTరాజకీయాల్లో అంతే.. ఎప్పటికీ ఎవరికీ ఆశ తీరదు.. వయసై పోతున్నా.. పార్టీ గెలవకున్నా పదవులపై కోరిక తగ్గదు.. ఇంట్లో ఎన్ని పదవులున్నా ఇంకా ఒకటి కావాలనిపిస్తుంది.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా సీనియర్ అయిన కాంగ్రెస్ నాయకుడి సంగతి ఇలానే ఉంది. రాజకీయాల్లో ఎవరికైనా రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం పదవి, జాతీయ స్థాయిలో అయితే ప్రధానమంత్రి పదవి లక్ష్యంగా ఉంటాయి. తెలుగు నాయకుల్లో ఒకాయనకు ఇలానే సీఎం పదవిపై ఎప్పటినుంచో ఆశ ఉంది. రెండుసార్లు దాదాపు చేతికాడికి వచ్చి జారిపోయింది. మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆయన మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోవడం దెబ్బేసింది.
రెండు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం.. సర్పంచ్ స్థాయి నుంచి హోంమంత్రి వరకు ఎదిగిన నేపథ్యం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టున్న నాయకుడు జానారెడ్డి. అయితే, ఆయనకు సీఎం కావాలనేది ఒక కల. అయితే, ఈయన కళ్లముందే మంత్రులు కూడా కానివారు నేరుగా ముఖ్యమంత్రులు (కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి) అయ్యారు కానీ.. ఆయన మాత్రం మంత్రిగానే మిగిలిపోయారు.
బహుశా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 1980ల ప్రారంభం నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు జానారెడ్డి ఒక్కరేనేమో..? ఎన్టీఆర్ నుంచి రేవంత్ వరకు ఎందరో సీఎంలు అయినా.. తాను సీఎం కాలేదని ఆయన తెగ బాధపడిపోతున్నారు. తాజాగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తనకు సీఎం పదవి మిస్సైందని వాపోతున్నాడు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశించినవన్నీ జరగవు అని నిర్వేదం వ్యక్తం చేశారు.
కాగా, 1983లో తొలిసారి టీడీపీ తరఫున చలకుర్తి నుంచి గెలిచిన జానారెడ్డి.. అదే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శానసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును అధిగమించారు. కాగా, ఎన్టీఆర్ 1988లో ఒకేసారి 30 మంది మంత్రులను మార్చడంపై జానారెడ్డి విభేదించారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో కలిసి కొత్త పార్టీ స్థాపించారు. చలకుర్తి (ఆ తర్వాత నాగార్జునసాగర్) నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. తెలంగాణ తొలి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
2018 ముందుస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య, ఆ తర్వాత ఆయన కుమారుడు నోముల భరత్ చేతిలో (2021లో) ఓడిపోవడంతో జానారెడ్డి రాజకీయ జీవితంలో పెద్ద దెబ్బ. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మరో కుమారుడు రఘువీర్ రెడ్డి నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు.
