అదను చూసి ఉగ్రరూపం...కేంద్రానికి కొత్త సవాల్ !
కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఎన్నికల తరువాత కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 22 April 2025 7:38 PM ISTకేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఎన్నికల తరువాత కీలక నిర్ణయం తీసుకుంది. 370 అధికరణను రద్దు చేసింది. ఇలా డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాదాపుగా అయిదేళ్ళ పాటు కేంద్ర పాలన జమ్మూ అండ్ కాశ్మీర్ లో సాగింది.
ఈ రోజుకీ కేంద్ర పాలిత ప్రాంతంగానే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నారు. ఇక ఎన్నికలను గత ఏడాది నిర్వహించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ మధ్య కాలం అంతా చెదురూ మదురూ సంఘటనలు మినహా జమ్మూ అండ్ కాశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో అదను చూసి ముష్కర మూకలు ఉగ్రరూపం చూపించారు.
జమ్మూ అండ్ కాశ్మీర్ లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. అనంతనాగ్ జిల్లాలోని పహాల్గాం లో ఈ ఘటన జరిగింది. దాంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మొత్తం పది మంది పర్యాటకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.
ఉగ్రవాదులు అంతా ఒకేసారి కాల్పులు జరపడంతో పర్యాటకులు చెల్లాచెదురు అయిపోయారు. పహాల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు మొగ్గు చూపిస్తూంటారు. వేసవి కాలంలో అక్కడ ప్రకృతి బాగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొంటారు.
ఇటీవల కాలంలో బైసరన్ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. అయితే ఇక్కడకు చేరుకోవడానికి అయితే కాలి నడక అయినా లేదా గుర్రాల మీద అయినా రావాలి. సరిగ్గా ఇదే ఉగ్ర వాదులకు కలసి వచ్చిన అంశం అయింది. దాంతో వారు ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ తిష్ట వేశారు. పైగా ఆర్మీ డ్రెస్ లో వచ్చి మరీ పర్యాటకుల మీద దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్ర ఘటనకు తామే బాధ్యులమని టేఅర్ఎఫ్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ ఘటనతో కేంద్రం అలర్ట్ అయింది. దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అమిత్ షాతో మాట్లాడారు. అన్ని వివరాలూ తెలుసుకున్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన ఉగ్ర దాడిని ఖండించారు. కేంద్ర హోం మంత్రిని ఉగ్ర దాడి జరిగిన ప్రాంతానికి వెళ్ళమని ప్రధాని ఆదేశించారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ మధ్య కాలంలో పర్యాటకులు పెరుగుతున్నారు. అక్కడ వినోద రంగాలు కళకళలాడుతున్నాయి. సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందో అలా సాధారణ జీవనం అక్కడ ప్రజలు చేస్తున్నారు.
ఇక సమ్మర్ కావడంతో గతంలో ఇతర దేశాలకు వెళ్ళేవారు అంతా ఇటీవల రూటు మార్చి అందమైన జమ్మూ అండ్ కాశ్మీర్ కి వస్తున్నారు. అయితే ఇంతకాలం మరుగున పడిన ఉగ్ర భూతం ఇపుడు మళ్ళీ తెగబడుతోంది. తాను ఉనికి చాటుకుంటున్నాను అని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఫుల్ ఫోకస్ పెడుతున్న కేంద్రం ఈ ఘటనను పూర్తి సీరియస్ గానే తీసుకుంది. మరి ఏమి చేస్తుందో, కేంద్రం యాక్షన్ ప్లాన్ ఏమిటో అన్నది చూడాల్సి ఉంది.
