జమ్మూకశ్మీర్‌లో అలర్ట్.. జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. హైప్రొఫైల్ ఖైదీలను విడిపించేందుకు ప్లాన్!
జమ్మూకశ్మీర్‌లోని జైళ్లలో మగ్గుతున్న ముఖ్యమైన ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
By: Tupaki Desk | 5 May 2025 3:30 PMజమ్మూకశ్మీర్‌లోని జైళ్లలో మగ్గుతున్న ముఖ్యమైన ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ బల్వాల్ జైలు, జమ్మూలోని ఇతర జైళ్ల వద్ద భద్రతను భారీగా పెంచేశారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి కేసులో అరెస్టయిన స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ఈ జైళ్లలో ఉంచిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు ఆర్మీ వాహనం మీద దాడి చేసిన కేసులో పట్టుబడిన నిస్సార్, ముష్తాక్‌ల సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఈ ఉగ్రవాదులను విడిపించుకునేందుకు జైళ్లపై దాడులు జరిగే ఛాన్స్ ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆయా కారాగారాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డీజీ శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. 2023 నుంచి జమ్మూకశ్మీర్‌లోని జైళ్ల భద్రత సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే ఉంది.
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం ఒక ఉగ్ర స్థావరాన్ని గుర్తించాయి. ఈ స్థావరం నుంచే కమ్యేనికేషన్ పరికరాలు, 5 పవర్ ఫుల్ ఐఈడీ బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఈ స్థావరం సురాన్‌కోట్ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఆందోళలను రేకెత్తిస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్ర కదలికలు పెరిగినట్లు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
జైళ్లపై దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. జైళ్ల వద్ద ప్రత్యేక కమాండో బృందాలను మోహరించారు. జైలు పరిసరాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదులను విడిపించేందుకు జరుగుతున్న ఈ కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు అన్ని విధాలా రెడీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి.