Begin typing your search above and press return to search.

ఉగ్ర దాడిలో 27 మంది మృతి...కాశ్మీర్ లో రక్త కన్నీరు !

అనంతనాగ్ జిల్లా పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడులలో ఇప్పటిదాకా చూస్తే కనుక ఏకంగా 27 మంది పర్యాటకులు మృతి చెందారు ఉగ్ర భూతానికి వారు అలా బలి అయిపోయారు

By:  Tupaki Desk   |   22 April 2025 9:05 PM IST
ఉగ్ర దాడిలో 27 మంది మృతి...కాశ్మీర్ లో రక్త కన్నీరు !
X

జమ్మూ అండ్ కాశ్మీర్ ఉగ్ర దాడికి చిక్కుకుని విలవిలలాడుతోంది. అనంతనాగ్ జిల్లా పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడులలో ఇప్పటిదాకా చూస్తే కనుక ఏకంగా 27 మంది పర్యాటకులు మృతి చెందారు ఉగ్ర భూతానికి వారు అలా బలి అయిపోయారు. పహల్గాం లో ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన టూరిస్టుల మీద ఆర్మీ దుస్తులతో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఈ దుర్ఘటనలో మొదట ముగ్గురు మాత్రమే మరణించారని పదిమంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ జరిగింది దారుణ మారణ హోమమని తరువాత బయట ప్రపంచానికి తెలుస్తోంది. ఎటు చూసినా శవాలతో ఆ ప్రాంతమంతా అత్యంత భయంకరంగా మారింది. అంతే కాదు గాయపడిన వారిలో 20 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. దాంతో మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే ఇది ఊహకు అందని ఘాతుకం. చరిత్ర విస్తుబోయే కడు విషాదంగా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని ఆరేళ్ళ క్రితం ప్రకటించాక ఇంత పెద్ద విలయం ఎపుడూ ఎక్కడా చోటు చేసుకోలేదని అంటున్నారు. దేశం మొత్తం ఉలిక్కిపడే దారుణంగా దీనిని చూస్తున్నారు. అంతే కాదు ఈ ఉగ్ర దాడి పెను సవాల్ గా పరిణమించింది అని అంటున్నారు.

మరో సారి 1999 నాటి పరిణామాలను గుర్తు చేసింది. అప్పట్లో పదుల సంఖ్యలో ప్రతీ రోజూ ఉగ్ర దాడులకు బలి అయ్యారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత కంట్రోల్ అయింది. 2019లో 370 అధికరణను రద్దు చేశాక కాశ్మీర్ కూల్ గా ఉందని భావించారు. అడపా దడపా సంఘటనలు చోటు చేసుకున్నా కూడా ఇంత తీవ్ర స్థాయిలో ఎపుడూ పరిస్థితి లేదు.

ఒక విధంగా చూస్తే ఉగ్ర మూకలు భారీ చాలెంజ్ చేశాయి. దేశానికి నుదుట సింధూరంగా ఉన్న కాశ్మీర్ మీద తమ ఉగ్ర ముద్రలను బలంగా నాటే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సీరియస్ గానే అడుగులు వేస్తోంది. విదేశాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఉగ్ర దాడులకు పాల్పడిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఏది ఏమైనా కాశ్మీర్ ఈ సమ్మర్ లో అధ్బుతమైన టూరిజం స్పాట్ అని అంతా భావిస్తున్న వేళ కాశ్మీర్ లో భద్రత ఉందని సురక్షితమని అంతా బలంగా నమ్ముతున్న వేళ ఆ నమ్మకానికి విశ్వాసానికి తూట్లు పొడిచే విధంగా ఈ ఘాతుకం చోటు చేసుకుంది.

ఈ ఉగ్ర మూలాలను ఏరి పారేయక పోతే మాత్రం మళ్ళీ 90 నాటి రోజులు మొదలవుతాయా అన్న భయాలు స్థానికులతో పాటు దేశమంతా ఉంది. ఉగ్రమూకలను మట్టుబెట్టడంతో పాటు ఉగ్రవాదులను ఏరి పారేసే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కూడా కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా భారత దేశ చరిత్రలో ఒక విషాద ఘట్టంగా ఈ దారుణం ఉందని అంటున్నారు.