Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు జరిగేనా......ఆర్ఎస్ఎస్ ప్రభావమెంత ?

ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 2027 పూర్తి అవుతుందని అంటున్నారు. ఇక మిగిలింది 2028. ఒకే ఒక ఏడాది అన్న మాట.

By:  Tupaki Desk   |   13 July 2025 3:00 PM IST
జమిలి ఎన్నికలు జరిగేనా......ఆర్ఎస్ఎస్ ప్రభావమెంత ?
X

దేశంలో జమిలి ఎన్నికలు అంటూ ఇటీవల కాలంలో భారీగా ప్రచారం సాగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలపడంతో ఇంకేముంది జమిలి జోరుగా వచ్చేస్తోంది అని అనుకున్నారు. ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో జమిలి బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకుంటారు అని కూడా ప్రచారం సాగింది.

అయితే ఇపుడు చూస్తే ఒక్కసారిగా సీన్ మారుతోందా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు నిజంగా జరిగితే 2027 చివరిలో కానీ జరిగేట్టుగా లేదు. అంత టైట్ గా పొజిషన్ ఉంది. పైగా జనాభా గణన, కులగణన పూర్తి కావాలి. వాటి నివేదికలు రావాలి. ఇక పార్లమెంట్ సీట్లలో డీలిమిటేషన్ జరగాలి.

ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 2027 పూర్తి అవుతుందని అంటున్నారు. ఇక మిగిలింది 2028. ఒకే ఒక ఏడాది అన్న మాట. మరి ఇంతలా ఆత్రపడినా ముందస్తు ఎన్నికల కోసం తాపత్రయం తప్ప మరేమీ కాదని దానికి బదులు షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలకు వెళ్తే అయిదేళ్ళ పాటు అధికారంలో ఉండొచ్చు కదా అన్న చర్చ సాగుతోందిట.

మరో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా జరిగిన ఒక సభలో మాట్లాడుతూ 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అన్న మాట వాడారు. అది నేరుగా ప్రధాని మోడీకే తగులుతుందని అంటున్నారు. మరో రెండు నెలలలో ఆయన 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు.

అయితే ఆయన ఇప్పటికే ప్రధానిగా ఉన్నారు కాబట్టి మధ్యలో ఆయన తప్పుకోవడం జరగదని అంటున్నారు. ఏది జరిగినా వచ్చే ఎన్నికల తరువాతనే అని అంటున్నారు. అయితే ఆ వచ్చే ఎన్నికలు ఎంత ముందుగా వస్తే అంత ముందుగా మోడీ మాజీ ప్రధాని అవుతారా అన్న చర్చ కూడా సమాంతరంగా వస్తోంది.

పైగా మోడీ పక్కకు తప్పుకుంటే ప్రధాని పీఠం ఎక్కేందుకు బీజేపీలో చాలా మంది పోటీలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఎటూ ఆర్ఎస్ఎస్ మనసులో మాట ఏంటో తెలిసింది కాబట్టి చాలా మంది బాహాటం అవుతారని కూడా అంటున్నారు. దాంతో జమిలి ఎన్నికలు అని ఏణ్ణర్ధం ముందే పదవిని మోడీ వదిలేసుకుంటారా లేక 2029లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు పెట్టి మంచి మెజారిటీతో గెలిచి మరో సారి తానే పీఎం గా ఉంటారా అన్నదే ఇపుడు చర్చగా ఉందిట.

ఏది ఏమైనా జమిలి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఒక చర్చ. దాని మీద సాధ్యాసాధ్యాల గురించే అంతా ఆలోచిస్తున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల ప్రభావం కూడా పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో ఈ ప్రచారాలలో నిజాలు ఏమిటో.