Begin typing your search above and press return to search.

అటెన్షన్ జగన్.. జమ్మలమడుగులో ఇదేం రచ్చ?

రాజకీయ పార్టీలు అన్న తర్వాత నేతలు.. వారి మధ్య గ్రూపులు కామన్.

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:48 AM GMT
అటెన్షన్ జగన్.. జమ్మలమడుగులో ఇదేం రచ్చ?
X

రాజకీయ పార్టీలు అన్న తర్వాత నేతలు.. వారి మధ్య గ్రూపులు కామన్. అయితే.. పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా గ్రూపులు పని చేయటాన్ని తప్పు పట్టాల్సిందే. తమ అధిక్యతను ప్రదర్శించటం కోసం హద్దులు దాటే వారిని కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వానికి ఉంది. లేదంటే.. పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుంది. తాజాగా ఏపీ అధికారపక్షం వైసీపీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేధాలు పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పాలి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగులో చోటు చేసుకున్న ఉదంతం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైతే వారిపై చర్యల కత్తిని ఝుళిపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి.. అతని వైరి వర్గమైన గంగవరం శేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ.. తేడాలు తీవ్రమవుతున్నాయే తప్పించి.. వాటికి సొల్యూషన్లు మాత్రం లభించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా శేఖర్ రెడ్డి వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డిని కొందరు కిడ్నాప్ చేసి.. దాడి చేసినట్లుగా అతగాడు పేర్కొంటున్నాడు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యేపై అతడు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టానన్న కసితో తనను కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఎదుట నిలుచోబెట్టారన్నారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్వరంతో తనకు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. తనకు ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ తరహాలో చంపేసి.. డోర్ డెలివరీ చేస్తానని.. ప్రొద్దుటూరుకు చెందిన నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుందని వార్నింగ్ ఇచ్చినట్లుగా వాపోయాడు.

బుధవారం తాను ఎర్రగుంట్లకు బైక్ మీద వెళుతుండగా.. ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనంతో పాటు మరో వెహికిల్ తనను ఫాలో అయ్యారని.. సుమారు 18 మంది అనుచరులు తమ వాహనాలతో వచ్చి..తన భైక్ ను ఢీకొట్టి తనను కిడ్నాప్ చేసినట్లుగా శ్రీనివాసరెడ్డి వాపోయాడు. అక్కడినుంచి తనను కొడుతూ.. తన్నుతూ ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లారన్నారు. కారులో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లగా.. అప్పటికే అక్కడ మరో 20 మంది ఉన్నారని.. వారంతా కూడా తనను కొట్టినట్లుగా ఆరోపించారు.

గంగవరం శేఖర్ రెడ్డి దూరం కావటానికి తానే కారణమని ఆరోపిస్తూ తనపై దాడి చేశారన్నారు. తన సెల్ తీసుకున్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. తనను కిడ్నాప్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగటంతో తనను ఎమ్మెల్యే విడిచిపెట్టినట్లు చెప్పారు. దెబ్బలు బాగా తగిలిన వేళ.. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే మనుషులు తనను చంపేస్తారన్న భయంతో కడప రిమ్స్ లో చేరినట్లుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ముప్పు ఉందని వాపోయాడు. ఎన్నికలు మరికొద్ది నెలల్లో ముంచుకొస్తున్న వేళ.. సొంత పార్టీలో చోటు చేసుకున్న ఈ ఎపిసోడ్ పైన అధినేత జగన్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు స్పందించకపోవటం గమనార్హం.