Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు...ఈసీ లెక్క ఇదీ...!

మరో వైపు చూస్తే ఈ రోజుకీ కూడా ఒక పార్టీకి మెజారిటీ రాక పోయినా మధ్యలో ప్రభుత్వాలు కూలిపోయినా ఏమి చేయాలో స్పష్టత లేదు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 3:17 AM GMT
జమిలి ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు...ఈసీ లెక్క ఇదీ...!
X

జమిలి ఎన్నికలు అంటూ బీజేపీ ముచ్చటపడుతోంది కానీ దేశంలో దాదాపుగా నూటికి తొంబై శాతం పార్టీలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. దానికి కారణం జమిలి ఎన్నికలు అంటూ జాతీయ పార్టీలు తమ భావజాలాన్ని ఎన్నికల వేళ రాష్ట్రాల మీద జొప్పిస్తాయని ఒక దశ వచ్చేసరికి ప్రాంతీయ పార్టీల ఉనికి కష్టం అవుతుందని ఆందోళన చెందుతున్నాయి.

మరో వైపు చూస్తే ఈ రోజుకీ కూడా ఒక పార్టీకి మెజారిటీ రాక పోయినా మధ్యలో ప్రభుత్వాలు కూలిపోయినా ఏమి చేయాలో స్పష్టత లేదు. రాష్ట్ర పతిపాలన ఆ టైం మొత్తం పెడితే ఇక ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ ఉంటుంది అన్న చర్చ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జమిలి ఎన్నికలు అంటూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెడితే ఆ ఖర్చు అంతా తడిసి మోపెడు అవుతుంది అని లెక్క వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఆ లెక్క చూస్తే కళ్ళు బైర్లు కమ్మెలాగే ఉంది. మొత్తం ఈవీఎంలను కొనేందుకే ప్రతీ పదిహేనేళ్ళకు పది వేల కోట్ల రూపాయలు దాకా ఖర్చు అవుతుందని ఈసీ లెక్క వేసింది. అదే విధంగా చూస్తే కనుక అనేక ఇతర ఖర్చులు మందీ మార్బలం ఇలాంటివి చాలా ఉంటాయని పేర్కొంది. ఒక ఈవీఎం జీవిత కాలం మూడు ఎన్నికల వరకు మాత్రమే అని ఈసీ తేల్చింది.

ఇక జమిలి ఎన్నికలు అనుకుంటే అసెంబ్లీకి ఒకటి ఎంపీ సీటుకు మరొకటి అన్నట్లుగా రెండు సెట్ల ఈవీఎంలను వాడాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలు అలాగే కంట్రోల్ యూనిట్లు వీవీ ప్యాట్ మిషన్లను అదనంగా రిజర్వ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్టంగా 46 వేల 75 వేల వంద బ్యాలెట్ యూనిట్లు, 33 లక్షల 63 వేల మూడు వందల కంట్రోల్ యూనిట్లు. 36 లక్షల 63 వేల 600 వీవీ ప్యాట్లు అవసరం పడతాయని ఈసీ అంటోంది. ఇలా వీటన్నింటికీ కలిపి పది వేల కోట్లను రఫ్ గా నే ఈసీ అంచనా వేసింది.

అదే సందర్భంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే అదనపు పోలింగ్ భద్రతా సిబ్బంది, అలాగే ఈవీఎం స్టోరేజ్ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరం అవుతాయని పేర్కొంది. ఇలా కొత్త యంత్రాలు ఇతర అవసరం అయినవి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే 2029 నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడవచ్చేమో అని ఈసీ అంటోంది.

ఇక జమిలి ఎన్నికలు అంటే రాజ్యాంగంలోని అయిదు అంశాలను పరిశీలించాల్సి ఉందని కూడా పేర్కొంది. మొత్తానికి చూస్తే జమిలి ఎన్నికలు అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని అర్ధం అవుతోంది. దీని మీద మాజీ రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ నాయకత్వంలో నియమించిన కమిటీ ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది.