Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు లేనట్టేనా?

దేశంలో పార్లమెంట్‌ నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అవసరమని బాంబుపేల్చింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 7:26 AM GMT
జమిలి ఎన్నికలు లేనట్టేనా?
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసారి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలకు చాలా ప్రత్యేకత ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సెప్టెంబర్‌ 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతా ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దేశమంతా అన్ని రాష్ట్రాలకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం (వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌), ఇండియా పేరును భారత్‌ గా మార్చడం, తదితర అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతుందని చర్చోపచర్చలు సాగాయి. అయితే కేంద్రం అనూహ్యంగా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

ఇప్పటికే జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక టాస్కుఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే వేసవిలోగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం తదితర రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2025లో మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 11 రాష్ట్రాలకు ఒకేసారి లోక్‌ సభ ఎన్నికలతోపాటే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇందుకోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్దేశిత కాలపరిమితి కంటే కుదించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్‌ నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అవసరమని బాంబుపేల్చింది.

అయితే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియను కేవలం వారం రోజుల్లో పూర్తి చేయగలిగితే ఈ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇందుకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా చేస్తే రూ.10 లక్షల కోట్లు అయ్యే ఈ వ్యయాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు తగ్గించవచ్చని సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ తెలిపింది.

ఈ మేరకు దేశంలో జమిలి ఎన్నికలపై సీఎంఎస్‌ తాజాగా అధ్యయనం చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు 1.20 లక్షల కోట్లు ఖర్చు కావచ్చని పేర్కొంది. కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల ధర కూడా ఇందులో భాగం కాదని వివరించింది. ఈ రూ. 1.20 లక్షల కోట్లలో ఎన్నికల సంఘం 20 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని తెలిపింది. మిగతా అంతా పార్టీల ఖర్చే ఉండనుందని వివరించింది.

లోక్‌సభ ఎన్నికలకు రూ.1.20 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (4,500 సీట్లు) రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని సీఎంఎస్‌ అంచనా వేసింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు (సుమారు 500) ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే రూ. లక్షల కోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కేంద్రం కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఎక్కడా చర్చ జరగకపోవడం ఇందుకు నిద్శరనమంటున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇంకా ఎన్నికలకు సమయం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఆయన జమిలి ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

కాగా ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే దేశంలో సగం రాష్ట్రాల శాసనసభలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లోక్‌ సభలో 67 శాతం, రాజ్యసభలో 67 శాతం సభ్యులు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుందని అంటున్నారు. లోక్‌ సభలో బీజేపీకి అటూఇటుగా బలం ఉండటంతో అక్కడ తీర్మానం నెగ్గినా రాజ్యసభలో 67 శాతం మద్దతు లేకపోవడంతో ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తేనే జమిలి ఎన్నికలకు ముందడుగు పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. బీజేపీ నేతత్వంలోని ఎన్‌డీఏకు లోక్‌ సభలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61 శాతానికి సమానమని అంటున్నారు. మరో 5 శాతం ఓట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. రాజ్యసభలో కేవలం 38 శాతం మాత్రమే బీజేపీకి సీట్లు ఉన్నాయి. దీంతో మరో 29 శాతం ఓట్లు బీజేపీకి అవసరమవుతాయి. అప్పుడే జమిలి ఎన్నికల బిల్లు నెగ్గుతుంది.

కాగా జమిలి ఎన్నికలకు కేంద్రం ముందుకెళ్లాలంటే.. రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్‌ 356కి సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే పార్లమెంటు పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 83, పార్లమెంటును రాష్ట్రపతి రద్దు చేసే అధికారమున్న ఆర్టికల్‌ 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 172ను, అసెంబ్లీలను రద్దు చేసే ఆర్టికల్‌ 174ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. జమిలి ఎన్నికల కోసం ఇంత పెద్ద ప్రక్రియ ఉండటంతోనే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంటున్నారు.