Begin typing your search above and press return to search.

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు అప్పటి నుంచేనా?

ఈ నేపథ్యంలో లోక్‌ సభతోపాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 6:40 AM GMT
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు అప్పటి నుంచేనా?
X

దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌ సభతోపాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్‌ జమిలి ఎన్నికల దిశగా పలు కీలక సిఫార్సులు చేయనున్నట్లు చెబుతున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ ను చేర్చాలని న్యాయ కమిషన్‌ సూచించనున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే, జూన్‌లో నిర్వహిస్తారు. జమిలి ఎన్నికల కోసం రానున్న ఐదేళ్లలో మొత్తం మూడు దశల్లో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువును సమానం చేస్తారు. అన్ని అసెంబ్లీలను ఏకీకరణ చేస్తారు.

ఈ నేపథ్యంలో 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు'పై రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ ను చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని సమాచారం. అందులో జమిలి ఎన్నికలతో పాటు లోక్‌ సభ–అసెంబ్లీలు–పంచాయతీలు–మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటరు జాబితా సంబంధిత అంశాలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త చాప్టర్‌ ను చేర్చి రాజ్యాంగ సవరణ చేస్తే పాత నిబంధనలను పక్కనపెట్టి వివిధ అసెంబ్లీల పదవీ కాలాలను మార్చగల అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది.

కాగా ఒకే దేశం.. ఒకే ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలి దశలో.. 3–6 నెలల మేరకు గడువును తగ్గించాల్సిన అసెంబ్లీలపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగా వాటి పదవీ కాలాలను తగ్గిస్తారని అంటున్నారు.

ఒకవేళ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోయినా, హంగ్‌ తలెత్తినా.. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా అసెంబ్లీలు సమైక్య సర్కారును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం కుదరకపోతే... ఆ అసెంబ్లీకి మిగిలి ఉన్న గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా ఇప్పటికే జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తోంది.