Begin typing your search above and press return to search.

ఖాన్‌ తో పెట్టుకోవద్దు.. పొలిటికల్‌ గేమ్స్‌ ఇలాగే ఉంటాయ్‌!

మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ తరఫున జలీల్‌ ఖాన్‌ తోపాటు టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న కూడా ఆశిస్తున్నారు, సీటు తమకంటే తమకని పోటీ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   1 March 2024 10:06 AM GMT
ఖాన్‌ తో పెట్టుకోవద్దు.. పొలిటికల్‌ గేమ్స్‌ ఇలాగే ఉంటాయ్‌!
X

జలీల్‌ ఖాన్‌ పరిచయం అక్కర్లేని పేరు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్స్‌ చదివానని చెప్పడం.. బీకాంలో ఫిజిక్స్‌ ఏంటంటూ అంతా ట్రోల్‌ చేయడం... దీనిపైన ఎన్నో రీల్స్, మీమ్స్‌ పుట్టుకురావడం జరిగిపోయాయి.

జలీల్‌ ఖాన్‌ విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి 1999లో విజయం సాధించారు. 2009లో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019లో జలీల్‌ ఖాన్‌ కు బదులుగా ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌ కు టీడీపీ టికెట్‌ ఇచ్చింది. అయితే ఆమె ఓడిపోయారు.

కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమ సీటును జలీల్‌ ఖాన్‌ ఆశిస్తున్నారు. అయితే విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఆశిస్తోంది. ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేశ్‌ సీటును ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన పోతిన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ తరఫున జలీల్‌ ఖాన్‌ తోపాటు టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న కూడా ఆశిస్తున్నారు, సీటు తమకంటే తమకని పోటీ పడుతున్నారు. వీరితోపాటు ఎంకే బేగ్‌ కూడా విజయవాడ పశ్చిమ సీటుపై కన్నేశారు.

ఇప్పటికే ఆయన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. అయితే పవన్‌ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ సీటును తనకివ్వకపోతే ముస్లింలు ఉరేసుకుంటారని హాట్‌ కామెంట్స్‌ కూడా జలీల్‌ ఖాన్‌ చేశారు. అయితే విజయవాడ పశ్చిమ సీటు తనకు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో జలీల్‌ ఖాన్‌ పార్టీ మారాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

దీంతో జలీల్‌ ఖాన్‌ వైసీపీలో చేరడానికి అన్నట్టు వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని కలిశారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ టీడీపీ లోక్‌ సభా ఇంచార్జి కేశినేని చిన్ని.. జలీల్‌ ఖాన్‌ ను నారా లోకేశ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని లోకేశ్‌.. జలీల్‌ ఖాన్‌ కు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో జలీల్‌ ఖాన్‌ బయటకొచ్చాక తాను పార్టీ మారడం లేదని టీడీపీలో ఉంటానని ప్రకటించారు.

అయితే సాయంత్రం తిరిగేసరికల్లా వైసీపీ నేతలతో జలీల్‌ ఖాన్‌ టచ్‌ లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాడేపల్లి వెళ్లి వైసీపీ పెద్దలను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆయనకు టికెట్‌ ఇచ్చామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే వైసీపీ విజయవాడ పశ్చిమకు స్థానిక కార్పొరేటర్‌ అయిన ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు జలీల్‌ ఖాన్‌ కు హామీ ఇవ్వడంతో ఆయననే బరిలోకి దింపొచ్చని అంటున్నారు.

వైసీపీ నేతలను కలిసి వచ్చాక జలీల్‌ ఖాన్‌ తన కార్యాలయంలో టీడీపీ జెండాలను తొలగించారని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ తాను పార్టీ మారడం లేదని జలీల్‌ ఖాన్‌ చెబుతుండటం కొసమెరుపుని అంటున్నారు.