బాబుపై టీడీపీ సీనియర్ నేత హాట్ కామెంట్స్ !
ఇదే తీరున ముస్లింల మీద వివక్ష చూపిస్తే కనుక మైనారిటీ వర్గాలు తిరగబడతారు అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 19 Sept 2026 8:32 AM ISTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. డబ్బులున్న వారికే రాజ్యసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కేవలం చిన్న స్థాయి నామినేటెడ్ మైనారిటీ పోస్టులతో సరిపెడుతున్నారని ఆయన విమర్శించారు. ముస్లింల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. ఇదే వైఖరి కనుక అనుసరిస్తే పార్టీ రేపటి ఎన్నికల్లో గెలవడం కష్టమని ఆయన తేల్చేసారు. ముస్లింల మద్దతు చాలా అవసరం అన్నది ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పదవిని ముస్లిం అభ్యర్థిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముస్లింలు తిరగబడతారు :
ఇదే తీరున ముస్లింల మీద వివక్ష చూపిస్తే కనుక మైనారిటీ వర్గాలు తిరగబడతారు అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తనకు చంద్రబాబు వైఖరి అసలు నచ్చడం లేదని అన్నారు. ఇప్పటికైనా ముస్లింల విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని జలీల్ ఖాన్ హెచ్చరించారు.
టీడీపీలో నో రియాక్షన్ :
తెలుగుదేశం పార్టీ తీరు మీదనే జలీల్ ఖాన్ చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో తన కుమార్తె ఓటమి పాలు అయిందని అన్నారు. దానికి టీడీపీ నేతల కుట్ర కారణం అన్నారు. ఆ పేర్లు ఇపుడు చెప్పను అని అంటూ టీడీపీలో చెప్పినా ప్రయోజనం లేదని అన్నారు. నో యాక్షన్ నో రియాక్షన్ అంటూ టీడీపీ పెద్దల తీరునే బాహాటంగా ఎండగట్టారు. దీనిని బట్టి చూస్తే జలీల్ ఖాన్ గట్టిగానే ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకుంటున్నారు అని అర్థమవుతోంది.
మూడు నియోజకవర్గాల్లో :
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ సీటు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ముస్లింలకే కేటాయిస్తూ వచ్చారని ఆయన చెప్పారు. అయితే 2024లో మాత్రం పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారని అయితే అక్కడ బీజేపీకి ఆఫీసూ లేదు, బలం అంతకంటే లేదని ఆయన ఫైర్ అయ్యారు. అయినా సరే సుజనా చౌదరి మంచితనంతో చంద్రబాబు మీద అభిమానంతో జనాలు గెలిపించారు అని అన్నారు. ఆనాడే తాను గట్టిగా మాట్లాడాల్సి ఉందని అయితే అప్పటి పరిస్థితుల వల్ల ఎందుకులే అని ఊరుకున్నాను అన్నారు. కానీ ఇపుడు మాత్రం సహించేది లేదని అన్నారు. ఈసారి కనుక మైనారిటీలకు మేయర్ పదవి చాన్స్ ఇవ్వకపోతే మూడు అసెంబ్లీ సీట్లు పాతిక దాకా కార్పోరేటర్ల స్థానాల్లో మైనారిటీలు తమ ప్రభావం చూపిస్తారు అని జలీల్ ఖాన్ హెచ్చరించడం విశేషం.
ఘాటు విమర్శలేనా :
టీడీపీ డబ్బున్న వారికే టికెట్లు ఇస్తుందని ఆ పార్టీలో రెండు మూడు కులాల పేర్లే వినిపిస్తాయని జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటను పుట్టిస్తున్నాయి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతలా బాబు మీద బాహాటంగా కామెంట్స్ చేసిన నాయకుడు ఎవరూ లేరని అంటున్నారు. అంతే కాకుండా మైనారిటీలు బడుగు వర్గాలకు అన్యాయం జరుగుతోంది అని ఆయన ఎలుగెత్తి చాటడం కూడా పార్టీని ఇబ్బందులో పడేసింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే జలీల్ ఖాన్ కి కోపం రావడానికి మరో కారణం విజయవాడ పశ్చిమ టీడీపీ ఇంచార్జిగా ముస్లిం నేతను కాకుండా బుద్ధా వెంకన్నను నియమించారు. దాంతో కూడా ఒక లాభం లేదు అని ఓపెన్ అయిపోయారని అంటున్నారు. మరి జలీల్ ఖాన్ విమర్శలకు టీడీపీ స్పందన ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
