Begin typing your search above and press return to search.

జనసేనలోకి జక్కంపూడి ఫ్యామిలీ...?

అవునా నిజమేనా అని రాజకీయాల మీద ఆసక్తి అవగాహన ఉన్న వారు ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్సార్ కి ఎంతటి సన్నిహిత నేత అన్నది వేరేగా చెప్పాల్సి లేదు.

By:  Tupaki Desk   |   8 April 2025 12:30 PM
Jakkampudi Family Join janasena party Future
X

అవునా నిజమేనా అని రాజకీయాల మీద ఆసక్తి అవగాహన ఉన్న వారు ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్సార్ కి ఎంతటి సన్నిహిత నేత అన్నది వేరేగా చెప్పాల్సి లేదు. వైసీపీని జగన్ ఏర్పాటు చేస్తే తొలి జెండా గోదావరి జిల్లాలో పట్టుకున్నది ఆయనే.

ఆ తర్వాత ఆయన కుటుంబం మొత్తం వైసీపీకి విధేయులుగా ఉంటూ వచ్చింది. ఆయన సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి వైసీపీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక జక్కంపూడి ఇద్దరు కుమారులూ వైసీపీలో కీలకంగా ఉంటున్నారు.

జక్కంపూడి రాజా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజానగరం నుంచి గెలిచారు. ఆయన 2024 ఎన్నికల్లో ఓడారు. దానికి కారణం అక్కడ బలంగా జనసేన తిష్ట వేయడమే. జనసేనను వైసీపీలో ఉన్నపుడు ఎంతగానో విమర్శించిన జక్కంపూడి ఫ్యామిలీ చూపు ఇపుడు గాజు గ్లాస్ మీద ఉందా అన్నది చర్చ సాగుతోంది.

జక్కంపూడి రాజా సోదరుడు వైసీపీ యువనేత అయిన గణేష్ వైసీపీకి ఇటీవల రాజీనామా చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి . ఆయన మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్ తో విభేదాల వల్లనే రాజీనామా చేసినట్లుగా చెబుతున్నా కూడా లోపల వేరే వ్యూహాలతోనే ఈ రాజీనామా జరిగింది అని అంటున్నారుట.

రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటి నుంచే మార్గాని భరత్ తో జక్కంపూడి సోదరులకు విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు నిజానికి జక్కంపూడి గణేష్ రాజమండ్రి అసెంబ్లీ సీటుని 2024 ఎన్నికల్లో కోరుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయిన మార్గాని భరత్ కి జగన్ ఇచ్చారు. దాంతోనే కొంత అసంతృప్తికి ఆ ఫ్యామిలీ గురి అయింది అని అంటున్నారు.

వైసీపీకి తమ కుటుంబం కట్టుబడి ఉందని అందువల్ల రెండు అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేరా అన్న చర్చ కూడా సాగిందట. ఇక వైసీపీ ఘోర ఓటమి తరువాత రాజాకు రాష్ట్ర వైసీపీ యూత్ వింగ్ బాధ్యతలను జగన్ అప్పగించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణలు సామాజిక సమీకరణలు గోదావరి జిల్లాలో ఈ కుటుంబం జాగ్రత్తగా గమనిస్తోంది అని అంటున్నారు.

జనసేన బలంగా ఉన్న చోట ఎదురీతను జక్కంపూడి ఫ్యామిలీ గుర్తించిందా అన్న చర్చ కూడా ఉంది. అయితే అన్న దమ్ముల మధ్య కొంచెం గ్యాప్ ఉంది అంటున్నారు .. అన్న రాజా ఏమో వైస్సార్సీపీ లోనే ఉందాం..జనసేన వద్దు అని అంటున్నారు అని తెలుస్తుంది .. కానీ తమ్ముడు జనసేన ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది . కేరాఫ్ వైసీపీగా బలమైన ముద్ర ఉన్న జక్కంపూడి ఫ్యామిలీ ఇప్పట్లో అయితే జనసేన వైపు వెళ్ళదని అంటున్నారు ముందుగా గణేష్ ఎమన్నా జనసేన వైపు స్టెప్ తీసుకుంటారా అనే చర్చ గోదావరి జిల్లాలో వినిపిస్తుంది.

ఇక 2029 ఎన్నీకల నాటికి రాజకీయం చూసుకుని మొత్తం ఫ్యామిలీ జంప్ చేస్తారు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. జగన్ అంటే ప్రాణం పెట్టే జక్కంపూడి ఫ్యామిలీ అలా చేస్తుందా అంటే ఏమో ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు అన్న వాదన కూడా ఉంది. చూడాలి మరి ఈ పుకార్లు ఏమవుతాయో ఏమిటో.