ప్రపంచం గందరగోళానికి కారణం అమెరికానే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు!
ప్రపంచం ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఒక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోందని, దానికి ఓ రకంగా అమెరికానే కారణమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 23 May 2025 1:16 PM ISTప్రపంచం ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఒక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోందని, దానికి ఓ రకంగా అమెరికానే కారణమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ మూడు దేశాల పర్యటనలో ఉన్న ఆయన, నెదర్లాండ్స్‌లో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్', పాకిస్తాన్ ఉగ్రవాదం, ఉక్రెయిన్-గాజా యుద్ధాలు, అమెరికా వాణిజ్య యుద్ధం, కాశ్మీర్ సమస్య వంటి అనేక కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ప్రపంచం బహుళ ధ్రువాలుగా మారుతుందని ఆసియా ఎదుగుదలపై ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
పొలిటికెన్‌కు ఇచ్చిన ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ డెన్మార్క్‌పై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం ప్రస్తుతం ఒక అస్తవ్యస్తమైన దశ గుండా వెళుతోందని, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొందని అన్నారు. గాజా, ఉక్రెయిన్‌లో విధ్వంసకర యుద్ధాలు జరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించింది. చైనా తైవాన్‌ను బెదిరిస్తోంది. అదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ తీవ్రమైన సైనిక సంఘర్షణ తర్వాత ఉత్కంఠగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అన్ని పరిణామాల తర్వాత కూడా ప్రపంచం మళ్లీ సమతుల్యం అవుతోందని జైశంకర్ అన్నారు. ప్రపంచం పాశ్చాత్య దేశాల ప్రభావం నుంచి బయటపడుతూ మరింత వైవిధ్యంగా, మరింత ప్రపంచీకరణ చెందుతూ చాలా వరకు మరింత ఆసియా ప్రాబల్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో కార్యక్రమంలో "పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రం అని మీరు గతంలో కూడా అన్నారు. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాటపై నిలబడతారా?" అని మంత్రి జైశంకర్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ.. "అవును, నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను" అని స్పష్టం చేశారు. ఆయన ఉదాహరణలతో వివరంచారు.
జైశంకర్ తన ప్రసంగంలో భారత్ ఉగ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి కూడా ప్రస్తావించారు. ఇది భారతదేశం తన భద్రత విషయంలో ఎంత కట్టుబడి ఉందో స్పష్టం చేస్తుందని అన్నారు. కాశ్మీర్ అంశంపై కూడా ఆయన భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యంగా ఆసియా ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగడం ప్రపంచ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరించారు. ఈ సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లో భారతదేశం ఒక కీలకమైన, బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
