Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ లా భారత్ బ్రోకర్ దేశం కాదు.. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

భారత్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి కోసం తన వంతు ప్రయత్నం చేస్తోంది.

By:  A.N.Kumar   |   25 March 2026 10:34 PM IST
పాకిస్తాన్ లా  భారత్ బ్రోకర్ దేశం కాదు.. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
X

విదేశాంగ రంగంలో భారత్ తనదైన ముద్రను వేస్తూ ప్రపంచ వేదికపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. భారత విదేశాంగ విధానం పటుత్వాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

"భారత్ బ్రోకర్ దేశం కాదు".. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో జైశంకర్ స్పందిస్తూ.. భారత్ ఎన్నటికీ పాకిస్థాన్ తరహాలో "బ్రోకర్ దేశం"గా వ్యవహరించదని స్పష్టం చేసినట్లు సమాచారం. భారత్ ఎప్పుడూ తన సొంత కాళ్లపై నిలబడే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని ఎవరికీ తొత్తుగా లేదా మధ్యవర్తిగా ఉండి తన ప్రయోజనాలను తాకట్టు పెట్టదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సుమారు 1 గంట 45 నిమిషాల పాటు సాగిన ఈ అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ వ్యవహారాలపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. భారత్ తీసుకునే నిర్ణయాలు ఏ దేశ ఒత్తిడికీ లొంగవు. మన జాతీయ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశం తన ఉనికి కోసం మరొక దేశంపై ఆధారపడటం లేదా మధ్యవర్తిత్వం పేరిట లబ్ధి పొందాలని చూడటం భారత్ నైజం కాదని ఆయన పరోక్షంగా పాకిస్థాన్‌ను ఎండగట్టారు. ప్రపంచ దేశాల మధ్య భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా ఎదుగుతోందే తప్ప, కేవలం చర్చల రాయబారిగా మిగిలిపోదని స్పష్టం చేశారు.

ఇంధన భద్రతపై భరోసా

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్‌కు చమురు సరఫరా ఆగిపోతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రభుత్వం ప్రజలకు రాజకీయ పార్టీలకు పూర్తి భరోసా ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని.. ఎటువంటి కొరత రాబోదని కేంద్రం వివరించింది. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో మరో నాలుగు చమురు నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయి. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. దేశీయంగా ఇంధన ధరలు సామాన్యుడికి భారంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

శాంతి వైపు భారత్ అడుగులు

భారత్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి కోసం తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రక్రియలో దేశ గౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వడం లేదు. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ వివాదం.. మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ తన సమతుల్యతను అద్భుతంగా ప్రదర్శిస్తోంది.

జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ యొక్క "న్యూ ఇండియా" దృక్పథాన్ని చాటిచెబుతున్నాయి. "మనం ఎవరికీ తలవంచం.. మన దారి మనదే" అనే స్పష్టమైన సందేశాన్ని ఆయన ప్రపంచానికి పంపారు. ఈ దృఢమైన విదేశాంగ విధానం భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.