తెలంగాణా రాష్ట్రం క్రెడిట్ జైపాల్ రెడ్డి దేనా ?
తెలంగాణా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన జైపాల్ రెడ్డి పీవీ నరసింహారావు తరువాత అంతటి పేరు సాధించారని రేవంత్ రెడ్డి అన్నారు.
By: Tupaki Desk | 27 July 2025 2:00 AM ISTజైపాల్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. మొదట్లో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో రాజకీయాలు చేసిన ఆయన తరువాత రోజులలో అదే కాంగ్రెస్ లో చేరి ఉన్నత పదవులు అలంకరించారు. ఆయన కేంద్ర మంత్రిగా కీలక శాఖలను చూశారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు తెలంగాణా ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే ఆ సమయంలో జైపాల్ రెడ్డి పోషించిన అతి ముఖ్య పాత్ర వల్లనే తెలంగాణా రాష్ట్ర సాధన జరిగింది అన్నది ఒక అభిప్రాయంగా చాలా మందిలో ఉంది. దానిని ఇపుడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా నొక్కి చెబుతూ జైపాల్ రెడ్డి వల్లనే రాష్ట్ర సాధన జరిగిందని స్పష్టం చేశారు.
జైపాల్ రెడ్డి వల్లనే సాధ్యమైందా :
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం తొలి విడత పోరాటం 1960 దశకం చివరిలో జరిగింది. మలిదశ పోరాటం 1990 దశకం చివరిలో మొదలైంది. ఇక కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణా రాష్ట్ర సమితిని ప్రారంభించారు. ఆ తరువాత ఉద్యమం ఊపందుకుంది అన్నది ఉంది. అయితే కేంద్ర స్థాయిలో ఎంతో బలంగా ఉంటూ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగానే తెలంగాణా వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆయన కృషి ఫలితమే రాష్ట్రం :
జైపాల్ రెడ్డి చాలా అనుభవం కలిగిన వారు. మేధావిగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆ విధంగా ఆయన చేసిన కృషి ఫలితమే ఈ రోజు అంతా అనుభవిస్తున్న తెలంగాణా అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర అతి ముఖ్యమైనది అని ఆయన చెప్పారు అంతే కాదు ఎన్నడూ మరువలేనిది అన్నారు. జైపాల్ రెడ్డి అన్న నాయకుడు లేకపోతే తెలంగాణా అన్న కల సాకారం అయ్యేది కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సోనియాగాంధీ ఏం చెప్పారంటే :
జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణా సాధ్యమైందని ఎవరో చెప్పడం కాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే ఆ మాట చెప్పారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి తెలంగాణా రాష్ట్రం కోసం ఎంతో చొరవ చూపారని ఒక సందర్భంలో సోనియా గాంధీ అన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన పాత్రను ఆయన కృషిని ఎవరూ మరచిపోలేనిది అని ముఖ్యమంత్రి చెప్పారు.
పీవీ తరువాత ఆయనే :
తెలంగాణా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన జైపాల్ రెడ్డి పీవీ నరసింహారావు తరువాత అంతటి పేరు సాధించారని రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న జైపాల్ రెడ్డి అజాత శతృవుగా
ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధులను కూడా సిద్ధాంతపరంగా వ్యతిరేకించారు తప్ప వ్యక్తిగతంగా కాదు అన్నారు. ఆయన కృషి వల్లనే సమాచార హక్కు చట్టంతో పాటు అనేక సంస్కరణలు కూడా వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.
రాజకీయాలు ప్రమాదకరం :
వర్తమాన రాజకీయాలు కడు ప్రమాదకరంగా తయారు అయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతపరమైన రాజకీయం పోయిందని అన్నారు. స్విగ్గీ రాజకీయాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయాలు పోయి పొలిటికల్ మేనేజ్మెంట్ తో కూడిన రాజకీయాలు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.
