Begin typing your search above and press return to search.

జైలు సానుభూతి... జగన్ కు ఎంత దక్కిందో బాబుకు అంతే...?

ఆయన రాజమండ్రి జైలులో ఉన్న కష్టం, ఆయన బాధ అంతా ఓట్ల రూపంలో టీడీపీకి కవర్ అవుతుందా అంటే టీడీపీ లెక్కలు చూస్తే అదే నిజం అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 7:50 AM GMT
జైలు సానుభూతి... జగన్ కు   ఎంత దక్కిందో బాబుకు అంతే...?
X

మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ. ఎవరైనా సరే ఎంత తప్పు చేసినా జైలుకు వెళ్తే మాత్రం అయ్యో పాపం అని అంటారు. అలా సానుభూతి టన్నుల కొద్దీ వెల్లువలా వచ్చేస్తుంది. దానితో అధికారం సులువుగా దక్కుతుంది అని రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తూంటారు.

ఇక ఏపీలో కాకలు తీరిన రాజకీయ నేత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆయన జైలు పాలు అయ్యారు. కొద్ది నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయనగా జరిగిన ఈ అరెస్ట్ తో టీడీపీకి సానుభూతి పెద్ద ఎత్తున దక్కుతుంది అని టీడీపీ ఊహిస్తోంది. ఈ విషయంలో వైసీపీ రాంగ్ టైం లో స్ట్రాటజీ అమలు చేసింది అని లోలోపల సంతోషిస్తోంది.

చంద్రబాబుకు సానుభూతి దక్కుతుందా. ఆయన రాజమండ్రి జైలులో ఉన్న కష్టం, ఆయన బాధ అంతా ఓట్ల రూపంలో టీడీపీకి కవర్ అవుతుందా అంటే టీడీపీ లెక్కలు చూస్తే అదే నిజం అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు భాషలో చెప్పాలంటే బాబు అరెస్ట్ అన్నది వైసీపీకి మరణ శాసనం. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి దక్కే సానుభూతితో వైసీపీ కొట్టుకుని పోతుందని ఆయన విశ్లేషణగా ఉంది.

దానికి తోడు ఎటూ అధికార పార్టీ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. విపక్షాల మధ్య పొత్తులు ఉంటే అన్నీ కలసి వచ్చి 2024 లో టీడీపీ మళ్లీ అధికార పీఠాన్ని పట్టేస్తుంది అని టీడీపీ అంచనా కడుతోంది. అయితే ఈ అంచనా కరెక్టా కాదా అంటే వైసీపీ విశ్లేషణ మరోలా ఉంది.

అసలు బాబుకు ఎపుడు సానుభూతి దక్కిందని, ఇపుడు జనాలు సానుభూతి చూపించడానికి అంటోంది. 2023 అక్టోబర్ లో అలిపిరి వద్ద ఆయన మీద మావోయిస్టులు హయ్తా యత్నం చేసినపుడే సానుభూతి వెల్లువలా రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో ముదురు పొలిటీషియన్ అయిన చంద్రబాబు నిజాయతీ మీద అందరికీ అవగాహన ఉందని అంటున్నారు.

ఆయన ఏ తప్పూ చేయలేదని టీడీపీ వారే అనడంలేదని కూడా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి ఇన్నాళ్ళూ బయటపడలేదని, ఇపుడు సరైన టైం లో పడిదని అంటున్నారు. అంతే తప్ప ఆయనను అకారణంగా అరెస్ట్ చేశారు అని ఎందుకు అనుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు. తమ నేత మీద ప్రజలకు అంతలా సానుభూతి కురుస్తుంది అంటే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానలలో సుప్రీం కోర్టు లాయర్లను ఎందుకు కోర్టు ముందుకు రప్పించుకున్నారని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

అక్కడే ఈ కేసులో ఏదో జరగబోతోంది అని ఊహించే బయటపడేందుకు టీడీపీ లాయర్లను పెట్తుకుందని అందువల్ల ప్రజలకు ఈ విషయాలు అన్నీ బాగా తెలుసు అంటున్నారు. ఇక జగన్ కి జైలు సానుభూతి ఏమీ కలసిరాలేదని గుర్తు చేస్తున్నారు. అలా కలసి వస్తే ఆయన 2014లోనే సీఎం అయ్యేవారని కానీ చిత్రంగా అపుడు చంద్రబాబు అయ్యారని అంటున్నారు. 2019 నాటికి జగన్ సీఎం కావడానికి చంద్రబాబు అద్వాన్న పాలనతో పాటు, జగన్ కష్టం, పాదయాత్ర, వైసీపీ ఒక పార్టీగా జనాల నమ్మకం గెలుచుకోవడం వల్లనే అని అంటున్నారు.

ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా విస్తృతం అయి ఉందని అందువల్ల ఎవరేమిటి అన్నది జనాలకు తెలుసు అని అంటున్నారు అకారణంగా చంద్రబాబు జైలుకు వెళ్ళలేదు అని కూడా తెలుసు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి మరింతగా ఎస్టాబ్లిష్ అయిందని అది వైసీపీ అడ్వాంటేజ్ అని ఆ పార్టీ అంటోంది.

ఇన్నాళ్ళూ బాబు అవినీతిపరుడు అని మాటలకే చెప్పిన వైసీపీ ఇపుడు ఆధారాలతో సహా జనలాకు చెప్పడానికి వీలు కుదిరిందని, అలా చూసుకుంటే కనుక టీడీపీకే ఈ అరెస్టులు జైలు జీవితం అన్నీ మైనస్ అవుతాయని అంటోంది. ఎన్నికల ముందు బాబుని అరెస్ట్ చేసి ఆయనకు సానుభూతి తెప్పించేటంత అమాయకంగా వైసీపీ లేదని గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయితేనే జనాల్లో స్పందన లేదని బంద్ కి పిలుపు ఇస్తే పెద్దగా పార్టీ జనాల నుంచే రియాక్షన్ లేదని గుర్తు చేస్తున్నారు. ఇక వైసీపీ మద్దతుదారులు ఎటూ తమ వైపు ఉంటారని, వైసీపీ అభిమానించే జనాలూ తమతో ఉంటారని, టీడీపీ జనాలు వారితో ఉన్నా న్యూట్రల్ జనాలు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కి కరడు కట్టిన ఫ్యాన్స్ బాబు అవినీతి మీద పోరాడి అలసిన వారు వీరంతా వైసీపీకే మద్దతుగా నిలుస్తారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే జైలు సానుభూతి అన్నది ఒక గాలి బుడగ అని బ్రహ్మపదార్ధం అని వైసీపీ తేల్చేస్తోంది. అయితే సానుభూతి కూడా తమకు అదనపు బలం అని తాము ఆ విధంగా కూడా అధికారంలోకి క్లియర్ గా రాబోతున్నామని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఆయన మరో తొమ్మిది నెలలలో టీడీపీకి అధికారం అని ప్రకటించేసారు. వైసీపీ అయితే కాదనే అంటోంది. అసలు విషయం ప్రజల తీర్పు ఏంతో తెలియాలంటే 2024 ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సిందే.