Begin typing your search above and press return to search.

జై అంధ్రా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకమైన కామెంట్స్ చేసినా అవి జనంలో చర్చనీయాంశం అవుతాయి.

By:  Satya P   |   4 Jun 2026 9:04 AM IST
జై అంధ్రా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకమైన కామెంట్స్ చేసినా అవి జనంలో చర్చనీయాంశం అవుతాయి. తాజాగా తెలంగాణా వాదం గురించి ప్రాంతీయ భావన గురించి మాట్లాడిన పవన్ ఇపుడు ఏపీలో ఆంధ్రుల గురించి కూడా కీలకమైన కామెంట్స్ చేశారు. తెలంగాణా వాదం విషయంలో పవన్ హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సింది చెప్పారు. దేశ సమైక్యత గురించి కూడా చెప్పారు. ఆ సంగతి అలా ఉంచితే ఏపీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆంధ్రుల గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రులలో ఐక్యతా స్పూర్తి కొరవడింది అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి.

సబ్ రీజియన్స్ గానే :

ఏపీలో చూస్తే ప్రాంతీయ భావన బలంగా లేదని పవన్ అన్నారు. ఉప ప్రాంతీయ వాదన ఎక్కువగా కనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణా ప్రజలను చూస్తే తనకు ముచ్చట వేస్తుందని పవన్ చెప్పారు. వారు తెలంగాణా అన్న బలమైన భావనను నిండుగా నింపుకుని కనిపిస్తారు అని పవన్ అన్నారు. అదే ఏపీలో అయితే ఉప ప్రాంతీయ భావనతో పాటు కులాలుగా విడిపోఅతున్నారని పవన్ చెప్పడం విశేషం.

ఉమ్మడి గుర్తింపు ఉండాలి :

ఏపీ ప్రజలంతా తాము ఆంధ్రులమన్న ఉమ్మడి భావనతో ఉండాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణా వారికి తెలంగాణా భావన ఉందని తమిళులకు వారి భాష ప్రాంతం మీద ఎంతో అభిమానం ఉందని కానీ ఏపీలో మాత్రం ఆందులకు ఆ తరహా ఉమ్మడి భావన లేకుండా పోయిందని పవన్ అన్నారు. ఎంతసేపు కుల తత్వం లేద ఉప ప్రాంతీయ తత్వమే తప్ప ఉమ్మడి భావన ఐక్యతా స్పూర్తి ఏదీ అని పవన్ ప్రశ్నించారు. అందుకే తాను ఇటీవల పార్టీ సమావేశంలో జై ఆంధ్రా అన్న నినాదం ఇచ్చాను అని పవన్ చెప్పారు. ఏపీ కోసం అయినా అంతా జై ఆంధ్రా అన్న నినాదాన్ని మననం చేసుకుని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ ఈ రోజుకు చూస్తే అన్ని రకాలుగా విడిపోయిందని దానిని కలపడానికి తాను శక్తివంచన లేకుండా తనదైన ప్రయత్నం చేస్తాను అని పవన్ చెప్పారు. మేమంతా ఆంధ్రులను అని అంతా భావించాలని అన్నారు. ఇది రాష్ట్ర శ్రేయస్సు కోసమే అని చెబుతూ అంతా కలసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పవన్ చెప్పుకొచ్చారు.

ఇది అవసరమే మరి :

పవన్ చెప్పినది చూస్తే వాస్తవమే అనిపిస్తుంది. ఆంధ్రులకు ఈ తరహా భావన లేదని గతంలో కూడా ఎందరో ప్రముఖులూ మేధావులు అంటూ వచ్చారు. దాని వల్లనే కూడా ఆంధ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని చరిత్ర చెబుతున్న సత్యం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన సందర్భం అయినా లేక 2014 ముందు వచ్చిన సమైక్య ఉద్యమం అయినా ఆంధ్రుల పాత్ర మీద ఇప్పటికీ చర్చ సాగుతుంది. తక్కువగానే స్పందన ఉందని కూడా అంటారు. ఇపుడు చూస్తే ప్రాంతీయ భావన అన్నది తప్పు కాదు, మన ఎదుగుదలకు అది మూలంగా ఉంటుంది. అందుకే పవన్ కూడా ఆ భావన బలపడాలి తప్పించి ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఇలా విడిపోవడం మంచిది కాదనే చెబుతున్నారు మరి ఆ విధంగా ఏపీ మారుతుందా జై ఆంధ్రా అంటూ ఉమ్మడిగా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.