Begin typing your search above and press return to search.

జాహ్నవి ఘటనపై వైట్‌ ‌ హౌస్‌ సీరియస్... రియాక్షన్ ఇదే!

దౌత్యాధికారి తరణ్‌ జీత్‌ సింగ్‌ సంధూ ఈ విషయాన్ని వాషింగ్టన్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 5:10 AM GMT
జాహ్నవి ఘటనపై వైట్‌ ‌ హౌస్‌  సీరియస్... రియాక్షన్  ఇదే!
X

భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈమె మరణించిన సమయంలో అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు, వెకిలి చేష్టలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారతీయులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ విషయంపై ఇండియా సీరియస్ గా రియాక్ట్ అవ్వగా... వైట్ హౌస్ కూడా రియాక్ట్ అవ్వక తప్పలేదు!

అవును... విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి వెకిలి చేష్టలపై అటు అమెరికాలోనూ ఇటు భారత్‌ లోనూ ఆగ్రహావేశాలు రగులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై శాన్‌ ఫ్రాన్సిస్కో లోని భారతీయ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. దౌత్యాధికారి తరణ్‌ జీత్‌ సింగ్‌ సంధూ ఈ విషయాన్ని వాషింగ్టన్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వైట్ హౌస్ నుంచి రియాక్ష వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ బృందంలోని సీనియర్‌ అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని దౌత్యాధికారి తరణ్‌ జీత్‌ సంధూకు హామీ ఇచ్చారు. కచ్చితంగా దర్యాప్తులో ఎలాంటి లోపాలూ లేకుండా చూస్తామని.. హామీ ఇచ్చారు!

అయితే... జాహ్నవి కందుల మృతి చెందిన సమయంలో అక్కడి పోలీస్‌ అధికారి హేలనగా మాట్లాడిన వీడియో తాజాగా బయటికి రావడంతో తీవ్ర దుమారానికి దారీతీసిన సంగతి తెలిసిందే. జాహ్నవి మరణం విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు అధికారి డానియెల్‌ అడరర్‌.. పై అధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి మృతి పట్ల వెకిలిగా మాట్లాడాడు.

వైకిలిగా నవ్వుతూ "ఆమె చచ్చిపోయింది. ఓ మామూలు వ్యక్తేలే. ఏముంది ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో.. విలువ తక్కువే.. అని వెర్కిలిగా నవ్వుతూ చులకనగా మాట్లాడారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డవ్వగా ఆ వీడియో వెలుగులోకి వచ్చంది.

వాస్తవానికి జాహ్నవి నడిచిన మార్గంలో 40 కి.మీ.లకి మించి వేగం దాటకూడదు. అయితే, జాహ్నవిని ఢీకొట్టే సమయానికి పెట్రోలింగ్‌ వాహనం 119 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. సరిగ్గా ఘటన సమయానికి స్పీడో మీటరులో 101 కిలోమీటర్లు చూపించింది. జీబ్రాలైన్‌ లో రోడ్డు దాటుతున్న జాహ్నవి వాహనం తగిలిన ధాటికి 130 అడుగుల దూరం ఎగిరిపడ్డారు. అయినప్పటికీ... వాహనం నడిపిన పోలీసు అధికారి తప్పేం లేదన్నట్టు డానియల్‌ నివేదిక ఇచ్చారు.

మరోపక్క దర్యాప్తు అధికారి డానియల్‌ మాటలు విని భారత్‌ లోని జాహ్నవి కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బిడ్డను కోల్పోయినదానికంటే ఎక్కువగా ఈ సంఘటన తమను కలిచివేసిందని జాహ్నవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి ప్రాణానికి విలువ లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సమయంలో తాజాగా వైట్ హౌస్ ఇలా రియాక్ట్ అయ్యింది.