టాటా మోటార్స్ షేర్ ఎందుకంత పతనమవుతోందో తెలుసా?
ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు టాటా సంస్థపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఆ కంపెనీ కార్ల అమ్మకాల మీద ఎఫెక్టు ఖాయం.
By: Tupaki Desk | 6 April 2025 11:57 AM ISTబ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ లలో ఒకటి జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఈ విలాసవంతమైన కార్లను అమెరికాకు ఎగుమతి చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా అమెరికాకు ఈ కార్ల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపేసినట్లుగా చెబుతున్నారు. ఎందుకిలా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇటీవల కాలంలో టాటా మోటార్స్ సంస్థ షేర్లు పతనం కావటానికి కారణాల్లో ఇది ప్రధాన అంశంగా చెబుతున్నారు.
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న ప్రతీకార పన్నును ఎలా అధిగమించాలన్న దానిపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ కసరత్తు చేస్తోంది. ఇటీవల మన దేశంలోకి దిగుమతి అయ్యే వాహనాల మీద 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటనల నేపథ్యంలో ల్యాండ్ రోవర్లను మరోసారి ఎగుమతిని తాత్కాలికంగా ఆపేసింది.
బ్రిటన్ లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్ ఆర్ సంస్థ.. బ్రిటన్ లో సుమారు 38 వేల మందికి ఉపాధిని కల్పిస్తుంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో చోటు చేసుకునే ప్రభావాన్ని.. ఫలితాల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారన్నది అసలు పాయింట్. ట్రంప్ ప్రతీకార సుంకాలతో చోటు చేసుకునే ప్రభావం.. ఒక నెల రోజుల పాటు ఎగుమతుల్ని నిలిపివేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రానున్న రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఇప్పటికే సదరు కంపెనీ ఎగుమతి చేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో జేఎల్ఆర్ మాత్రమే కాదు ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఏం చేయాలన్న దానిపై కసరత్తులు చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4.30 లక్షల వాహనాల్ని అమ్మగా.. అందులో నాలుగో వంతు అమెరికాలోనే అమ్ముడయ్యాయి.
ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు టాటా సంస్థపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఆ కంపెనీ కార్ల అమ్మకాల మీద ఎఫెక్టు ఖాయం. ఇది నెగిటివ్ గా ఉండే అవకాశం ఉండటంతో టాటామోటార్స్ షేర్లు పతనం అవుతున్నట్లుగా చెబుతున్నారు. ట్రంప్ సుంకాల్ని అధిగమించేందుకు వీలుగా ఏదైనా ప్రణాళికను సిద్ధం చేస్తేనే పరిస్థితుల్లో మార్పులు రావటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
