ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాకు కార్ల ఎగుమతులు నిలిపివేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్!
బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), దేశంలో సుమారు 38 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.
By: Tupaki Desk | 6 April 2025 4:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతి అయ్యే వాహనాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) బ్రిటన్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ‘ది టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ట్రంప్ విధించిన సుంకాలను ఎలా తగ్గించుకోవాలనే దానిపై సంస్థ ప్రస్తుతం ఆలోచనలు చేస్తోంది.
బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), దేశంలో సుమారు 38 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ట్రంప్ సుంకల వల్ల తమ వ్యాపారంపై కలిగే ప్రభావాన్ని తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నందున, దాదాపు ఒక నెల రోజుల పాటు అమెరికాకు కార్ల ఎగుమతులను నిలిపివేయాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాబోయే రెండు నెలలకు సరిపడా కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసిందని సమాచారం.
ట్రంప్ సుంకల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) మాత్రమే కాకుండా, ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా తమ భవిష్యత్తు వ్యాపార వ్యూహాల గురించి పునరాలోచనలో పడ్డాయి. 2024 మార్చి వరకు గడిచిన 12 నెలల కాలంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రపంచవ్యాప్తంగా 4.30 లక్షల వాహనాలను విక్రయించగా, అందులో నాలుగో వంతు అమ్మకాలు అమెరికాలోనే జరిగాయి. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన వెలువడిన వెంటనే టాటా మోటార్స్ షేర్లు పతనం కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ఉద్యోగాలు ఉండవని ఇదివరకే జేపీ మోర్గాన్ వంటి ఆర్థిక సేవల సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దిగుమతులపై అధిక సుంకాలు విధించడం వల్ల వినియోగదారులపై భారం పడుతుందని, తద్వారా అమ్మకాలు తగ్గి ఉద్యోగాల కోతకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ తీసుకున్న తాత్కాలిక నిర్ణయం, ట్రంప్ టారిఫ్‌లు అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేస్తోంది.
