ఏపీ మంత్రి నిమ్మలకు తెలంగాణా కాంగ్రెస్ సెగ!
ఏపీలో పనిమంతుడుగా సమర్థుడిగా మంత్రి నిర్మల రామానాయుడుని చెప్పుకుంటారు. ఆయనకు చంద్రబాబు కూడా మంచి మార్కులు వేస్తారు.
By: Tupaki Desk | 18 July 2025 10:22 PM ISTఏపీలో పనిమంతుడుగా సమర్థుడిగా మంత్రి నిర్మల రామానాయుడుని చెప్పుకుంటారు. ఆయనకు చంద్రబాబు కూడా మంచి మార్కులు వేస్తారు. కష్టపడే నైజం నిమ్మల సొంతం. ఆయన మూడు సార్లు వరసగా పాలకొల్లు నుంచి గెలిచి వచ్చారు. దాంతో బాబు ఆయన ప్రతిభను గుర్తించి కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. అయితే చంద్రబాబు ఎంతగానో నమ్మిన నిమ్మలకు ఏమీ తెలియదు అంటూ తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిమల తొలిసారి మంత్రి అయ్యాడని, ఆయనకు అనుభవం లేదని జగ్గారెడ్డి అంటున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన జలవనరుల శాఖకు అవగాహన ఉన్న వారిని ఎవరిని అయినా పెట్టుకోవాలి కానీ నిమ్మలను తెచ్చి పెట్టారని విసుర్లు విసిరారు. ఇదంతా ఎందుకు అంటే నిమ్మల బనకచర్ల ఇష్యూ అన్నది ఢిల్లీలో జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఉందని చెప్పడమే.
దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి అసలు బనకచర్ల అన్న ఇష్యూయే అక్కడ చర్చకు రాలేదని అన్నారు. అజెండాలో కూడా ఆ అంశం లేదని అన్నారు. అదే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు.
అయితే బొత్తిగా అవగాహన లేని మంత్రి కాబట్టే నిమ్మల బనకచర్ల అంశం చర్చకు వచ్చిందని అంటున్నారు. చంద్రబాబు జలవనరుల శాఖకు మంత్రిని మార్చుకోవాలని కూడా సూచించారు జగ్గారెడ్డి. మొత్తానికి చూస్తే ఏపీకి కొత్త మంత్రులు వస్తారు, ప్రస్తుతం ఉన్న వారు సరిగ్గా పనిచేయడం లేదు అని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చికాకు పడినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ కీలక సమయంలో నిమ్మల మీద జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ తో నిమ్మలకు ఏమైనా సీటు కుదుపు ఉంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది. చంద్రబాబుకు అత్యంత ఇష్టుడు కాబట్టి ఆయన మంత్రి పదవికి ఢోకా లేకపోయినా శాఖకు మాత్రం ఎసరు పెట్టేలా జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇంతకీ ఈ వ్యాఖ్యల మీద నిమ్మల ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.
ఇక బనకచర్ల అంశం అన్నది తెలంగాణాను హీటెక్కించేస్తోంది. ఈ అంశం మీదనే బీఆర్ఎస్ పట్టుబట్టి మరీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. దానికి నిమ్మల చేసిన వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ నేతలు తెలివిగానే ఉపయోగించుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలకు మంటెక్కిపోతోంది. అది అటు తిరిగి ఇటు తిరిగి నిమ్మల మీదకు వచ్చినట్లుంది అని అంటున్నారు. సో నిమ్మలకు తెలంగాణా కాంగ్రెస్ సెగ ఇపుడు బాగానే తగులుతోంది అని అంటున్నారు.
