Begin typing your search above and press return to search.

మోడీషాలకు కోపం వస్తే.. వీడ్కోలు కూడా ఉండదంతే

అయితే.. ఆయన వ్యవహారశైలి మీద బీజేపీకి అన్నీ తామైనట్లుగా వ్యవహరిస్తున్న మోడీషాలకు ఉన్న ఆగ్రహంతోనే ఇదంతా జరిగిందన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 July 2025 10:49 AM IST
మోడీషాలకు కోపం వస్తే.. వీడ్కోలు కూడా ఉండదంతే
X

కొన్ని విషయాలకు షుగర్ కోటింగ్ అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్య రీతిలో జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయటం.. అందుకు అనారోగ్యాన్ని కారణంగా చూపటం తెలిసిందే. ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవటం లాంటివి ఉండవు. ఆ మాటకు వస్తే.. అనారోగ్యంలో ఉన్నా ఆ పదవీకాలాన్ని ఇట్టే లాగించేయొచ్చు. నిజానికి పదవిలో ఉన్నప్పుడు అనారోగ్యం బారిన పడేటోళ్లు చాలా తక్కువ. పదవి.. పవర్ చేతి నుంచి చేజారిన తర్వాత సదరు వ్యక్తుల్లో వచ్చే మార్పులు అనూహ్యంగా ఉండటం తెలిసిందే. ఇలా చూసినా..ధన్ ఖడ్ కు ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు.

మరి.. ధన్ ఖడ్ మాష్టారు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్న వద్ద సరైన సమాధానం లేనట్లుగా ఆగిపోవాల్సి వస్తుంది. అయితే.. ఆయన వ్యవహారశైలి మీద బీజేపీకి అన్నీ తామైనట్లుగా వ్యవహరిస్తున్న మోడీషాలకు ఉన్న ఆగ్రహంతోనే ఇదంతా జరిగిందన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. నేరుగా మోడీషా అనకుండా బీజేపీ అధినాయకత్వమన్న ప్రచారం సాగుతోంది. బీజేపీలో అధినాయకత్వం అంటే ఎవరు? మోడీ.. అమిత్ షాలేగా? వీరు కాకుండా బీజేపీని కంట్రోల్ చేసే సీన్ ఎవరికి ఉంది?

అందుకే.. బీజేపీ అధినాయకత్వం అనే బదులు.. మోడీ.. అమిత్ షా అని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంతకూ ధన్ ఖడ్ రాజీనామా వెనుక మోడీషాలు ఉన్నారని.. వారికి నచ్చని కారణంగానే ఇదంతా జరిగిందని ఎలా చెబుతారు? దానికి ఉన్న ఆధారాలేంటి? అన్న ప్రశ్నలోకి వెళితే.. తాజా పరిణామాల్ని సమాధానాలుగా చూపుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్ ఖడ్ కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని విపక్ష నేత జైరాం రమేశ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో.. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి బలం చేకూరినట్లైంది.

తమిళనాడు ఎంపీల వీడ్కోలు కార్యక్రమం వేళ ధన్ ఖడ్ పేరు కూడా చేర్చాలని కాంగ్రెస్ భావిస్తే.. బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఎలాంటి వీడ్కోలు లేకుండానే ఆయన ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏడాది కాలంగా ఉప రాష్ట్రపతికి.. మోడీషాలకు మధ్య దూరం పెరగినట్లుగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ మీద ఆయన చేస్తున్న కామెంట్లపై మోడీషాలు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. జస్టిస్ వర్మ వ్యవహారంలోనూ ఆయన న్యాయవ్యవస్థ మీద పలు ప్రశ్నలు సంధించారు.

ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ తొలగింపునకు లోక్ సభలో తాము పిటిషన్ పెడుతున్నామని.. ఈ క్రమంలో రాజ్యసభలో విపక్షాలు పెట్టే పిటిషన్ విషయంలో ముందుకు వెళ్లకుండా చూడాలని కోరారు. అయితే.. అధికార పక్షం నుంచి వచ్చిన వినతి విషయంలో ధన్ ఖడ్ వేరుగా వ్యవహరించటం.. కాంగ్రెస్ పక్ష విపక్షాలు తీసుకొచ్చిన అభిశంసన నోటీసు విషయంలో ధన్ ఖడ్ వ్యవహరించిన వైఖరి మోడీషాలకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే సభలో పహల్గావ్ దాడి ఎపిసోడ్ కు సంబంధించి విపక్ష నేత మల్లికార్జునఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్ ఖడ్.. బీజేపీ తరఫు మాట్లాడేందుకు అవకాశం కోరిన నడ్డాకు అవకాశం ఇవ్వలేదు. దీంతో.. ఆయన తీరుతో విసుగు చెందిన మోడీషాలు.. ఆయనపై రాజీనామా ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా చెబుతన్నారు. వీటితో పాటు పలు అంశాల్లో ఆయన వైఖరి పట్ల ఆగ్రహం ఉన్న నేపథ్యంలో ఆయన్ను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అలా అధికారానికి కేంద్రంగా ఉండే మోడీషాల ఆగ్రహానికి గురైన ధన్ ఖడ్.. అనూహ్య రీతిలో రాజీనామా చేయటమే కాదు.. చివరకు వీడ్కోలు కూడా లేకుండానే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. అధికారం చేతిలో ఉన్నోడికి ఆగ్రహం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మరోసారి రుజువైందని చెప్పాలి.