Begin typing your search above and press return to search.

ఆ ఒక్క రాత్రి పూర్తి సీన్ మారింది.. ఓటమిపై జగ్గారెడ్డి పోస్ట్ మార్టం..

తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు. సంచలనాలకు కేంద్ర బింధువుగా ఉన్నారు ఆయన.

By:  Tupaki Desk   |   18 Dec 2023 10:25 AM GMT
ఆ ఒక్క రాత్రి పూర్తి సీన్ మారింది.. ఓటమిపై జగ్గారెడ్డి పోస్ట్ మార్టం..
X

తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు. సంచలనాలకు కేంద్ర బింధువుగా ఉన్నారు ఆయన. బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన కాంగ్రెస్ లో కొనసాగిస్తున్నారు. మధ్యలో ఒకసారి కేసీఆర్ ను కలిసి వచ్చారు. ఆ సమయంలో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారన్న ఊహాగానాలు సైతం వచ్చాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని తీసుకున్న సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో జగ్గారెడ్డి కూడా ఒకరు.

అయితే.. ఆయన రీసెంట్ జరిగిన (2023) ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీనిపై ఆయన ఇటీవల తన అనుచరులతో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇందులో సంచలన విషయాలను వెల్లడించారు. ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని షెడ్యూల్ కంటే ముందే సర్వేలు చెప్పాయి. వీటితో పాటు కాంగ్రెస్ వేవ్ విపరీతంగా కొనసాగింది. సర్వేలు ప్రకారం.. దాదాపు 75 నుంచి 80 సీట్ల వరకు వస్తాయని అంచనాలు కూడా వచ్చాయి. వీటిని పక్కన ఉంచితే 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తమ ఓటమిపై నేతలు పోస్ట్ మార్టం మొదలు పెట్టారు.

సంగారెడ్డి నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి మాట్లాడుతూ ‘తనకు ముందస్తుగా అందిన సమాచారంతో నవంబర్ 28వ తేదీ తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కేసీఆర్ కు తుది నివేదిక వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ 80-82 సీట్లు గెలుచుకుంటుందని నివేదిక తెలిపింది. దీంతో కేసీఆర్ 15-20 స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు స్థానాలు కూడా ఉన్నాయి. నవంబర్ 29, 30 తేదీల్లో ప్రచారంలో కేసీఆర్ తన డిజైన్ ను మార్చారు.

ఒక్కో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలకు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు పంపిణీ చేయాలని పార్టీ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఓటుకు రూ.2000, రూ.3000 నుంచి రూ.5000 వరకు ఇచ్చారు. అందుకే చివరి నిమిషంలో చాలా స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంద’ని చెప్పారు.

‘సంగారెడ్డిలో తన విజయం ఖాయమని 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని నవంబర్ 28న తనకు నివేదికలు అందాయి. 15 నుంచి 25 నియోజకవర్గాల్లో రూ. 30 కోట్లతో ఓటర్లను కొనుగోలు చేసిన బీఆర్ఎస్ డబ్బుతో ఒక్క రాత్రిలో మొత్తం పరిస్థితిని తన వైపునకు తిప్పుకుందని ఆరోపించారు. నవంబర్ 29వ తేదీ రాత్రి కేసీఆర్ కావాలనే ఈ నియోజకవర్గాల్లో డబ్బులు చల్లారని’ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.