Begin typing your search above and press return to search.

గోదావరి కోటలో జగన్ బీసీల బాట !

రెండు పార్టీలు కలసి చేసే మ్యాజిక్ ఏపీ పాలిటిక్స్ ని చేంజ్ చేస్తాయా అన్నది కూడా హాట్ టాపిక్ గా ఉంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:08 AM GMT
గోదావరి కోటలో జగన్ బీసీల బాట !
X

గోదావరి జిల్లాలు ఈసారి ఎన్నికల్లో కీలకం అని అంతా భావిస్తున్నారు. జనసేన బలం అంతా ఎక్కువగా గోదావరి జిల్లాలలో ఉంది అని ఒక విశ్లేషణ ఉంది. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్న టీడీపీకి కూడా గోదావరిలో బలం బాగానే ఉంది. రెండు పార్టీలు కలసి చేసే మ్యాజిక్ ఏపీ పాలిటిక్స్ ని చేంజ్ చేస్తాయా అన్నది కూడా హాట్ టాపిక్ గా ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే మొత్తం 34 అసెంబ్లీ సీట్లు గోదావరి జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ సామాజిక వర్గం పరంగా చూస్తే కాపులు అగ్ర స్థానంలో ఉంటారు. దాదాపుగా తొంబై శాతం నియోజకవర్గాలలో వారి హవా ఉంటుంది. అయితే అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఎక్కువగా చాలా సీట్లలో బీసీలు ఉన్నారు. బీసీలు ఒక కులం కాదు, అదే అసలైన తేడా.

కాపులు ఏకీకృతంగా ఒకే కులం గా ఉంటే బీసీలలో ఎన్నో కులాలు ఉన్నాయి. వారిని సమీకృతం చేస్తే మాత్రం కాపుల మీద రాజకీయంగా పై చేయి సాధించవచ్చు. ఇపుడు వైసీపీ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2024 ఎన్నికలో గోదావరి జిల్లాలలో మరోసారి గెలిచేందుకు అత్యధిక సీట్లను సొంతం చేసుకునేందుకు జగన్ బీసీ మంత్రం పఠిస్తున్నారు.

గతసారి కాపులకు ఇచ్చిన సీట్లలో సైతం ఈసారి కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా బీసీలను బరిలోకి దింపే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోంది. అదే టైంలో కాపులకు ఇవ్వాల్సిన చోట వారికే సీట్లు ఇస్తోంది.అలా చూస్తే కాకినాడ ఎంపీ సీటుతో పాటు పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, భీమవరం, తణుకు వంటి సీట్లను వారికే ఇస్తోంది.

అయితే రాజమండ్రి ఎంపీ సీటుని గతసారి బీసీలకు ఇచ్చిన వైసీపీ ఇపుడు కూడూ గూడూరు శ్రీనివాస్ అనే బీసీ నేతకు ఇస్తోంది.ఇక క్షత్రియుల లేకపోతే కాపులు అన్నట్లుగా లెక్క చూసుకుని మరీ ఎంపిక చేసే నర్సాపురం ఎంపీ సీటుని వైసీపీ బీసీలకు ఈసారి ఇస్తూ సరికొత్త ప్రయోగం చేసింది. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళకు ఇవ్వడం విశేషం. అని అంటున్నారు.

ఇక్కడ రెండు అంశాల మీద వైసీపీ గురి పెట్టింది అని అంటున్నారు. ఒకటి నర్సాపురం ఎంపీ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకోవడం అలాగే నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న మహిళ ఓటర్లను కూడా వైసీపీ దిశగా లాగేయాలని చూడడం. ఈ రెండు కనుక ఫలిస్తే వైసీపీ నర్సాపురం రాజకీయం పండినట్లే అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలలో శెట్టిబలిజలు, యాదవులు, అగ్ని కుల క్షత్రియులు, చేనేతలు ఇలా అనేక బీసీ కులాలు ఉన్నాయి. వారికి వీలున్న చోట్ల అలాగే వారి జనాభా ఎక్కువ ఉన్న చోట్ల సీట్లు కేటాయించడం ద్వారా బీసీలందరినీ ఒక త్రాటి మీదకు తీసుకుని రావాలని చూస్తోంది.

ఇక క్షత్రియులు కూడా గోదావరి జిల్లాలలో కీలకం, అందుకే నర్సాపురం అసెంబ్లీ సీటు వారికే ఇస్తోంది. అలాగే ఆచంట సీటుని కూడా వారికి ఇస్తారా లేక బీసీని దించుతారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే కాపులకు న్యాయం చేస్తూనే బీసీ బాణంతో వైసీపీ గోదావరిలో తన రాజకీయ వాటాను తేల్చుకోవాలని అనుకుంటోంది.