Begin typing your search above and press return to search.

మూడు రాజ‌ధానుల‌కు నాలుగేళ్లు.. జ‌గ‌న్ ప్లాన్‌ అమ‌లై ఉంటే..!

ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత‌గా, సీఎంగా జ‌గ‌న్‌.. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. స‌రిగ్గా ఆదివారానికి నాలుగేళ్లు పూర్త‌య్యాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:26 AM GMT
మూడు రాజ‌ధానుల‌కు నాలుగేళ్లు.. జ‌గ‌న్ ప్లాన్‌ అమ‌లై ఉంటే..!
X

ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత‌గా, సీఎంగా జ‌గ‌న్‌.. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. స‌రిగ్గా ఆదివారానికి నాలుగేళ్లు పూర్త‌య్యాయి. 2019, డిసెంబ‌రు 17న ఆయ‌న నిండు అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే అన్ని విధాలా అభివృద్ధి చెందిన‌ విశాఖ‌ప‌ట్నాన్ని పాల‌నా రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. దీనిని అమ‌లు చేసి తీరుతామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే.. అప్పటికే రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతులు.. దీనిని వ్య‌తిరేకించ‌డం..ప‌లు న్యాయ పోరాటాలు జ‌ర‌గ‌డంతో ఈ మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌.. ముందుకు సాగ‌లేదు. అంతేకాదు.. మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క్రియ ఇక్క‌డితో ఆగిపోతుంద‌ని కూడా తెలుస్తోంది. అయితే.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య ఇదే విష‌యం చ‌ర్చ‌గా న‌డుస్తోంది. మూడు రాజ‌ధానులు సాకార‌మై ఉంటే ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉండేది? అనేది వారి చ‌ర్చ‌ల సారాంశం.

విశాఖ క‌నుక పాల‌నా రాజ‌ధాని అయి ఉంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ రంగం ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టేద‌ని.. దీంతో విశాఖ రూపు రేఖ‌లు కూడా మారిపోయి ఉండేవ‌ని వైసీపీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు.. విశాఖ న‌గ‌రాన్ని కూడా భారీగా విస్త‌రించి ఉండేవార‌ని కూడా చెబుతున్నారు. దీనివ‌ల్ల యువ‌త‌కు.. మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు చిక్కేవ‌ని అంటున్నారు.

ఇక‌, క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేసి ఉంటే.. వెనుక బ‌డిన ప్రాంతంలో మెరుగైన ర‌హ‌దారి సౌక‌ర్యాల తోపాటు.. చుట్టుప‌క్క‌ల బిజినెస్ ఏరియాలు వ‌చ్చేవ‌ని.. అదేవిధంగా న్యాయ స‌హాయ కేంద్రాలు కూడా ఏర్ప‌డి ఉండేవ‌ని అంటున్నారు. ఇక‌, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా ఎలానూ ఉంచారు క‌నుక‌.. ఇక్క‌డ కూడా మ‌రింత అభివృద్ధి జరిగి ఉండేద‌ని నిర్మాణాలు కూడా పూర్త‌యి ఉండేవ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నా రు. అయితే..వీరెవ‌రూ కూడా రైతులు చేసిన ఉద్య‌మాన్ని త‌ప్పుప‌ట్ట‌డం లేదు. అదేస‌మ‌యంలో న్యాయ పోరాటాల‌ను కూడా త‌ప్పుప‌ట్ట‌డం లేదు. కేవ‌లం మూడు రాజ‌ధానులు సాకార‌మై ఉంటే.. ఏం జ‌రిగి ఉండేద‌ని మాత్ర‌మే చ‌ర్చించుకుంటున్నారు.