Begin typing your search above and press return to search.

జగన్ కి ముప్పు ఇంకా పొంచి ఉందా ?

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ముప్పు తొలగి పోయింది అని ఒక వైపు అంటున్నా ఇంకా ఆయనకు అది అలాగే ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 3:54 AM GMT
జగన్ కి ముప్పు ఇంకా పొంచి ఉందా ?
X

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ముప్పు తొలగి పోయింది అని ఒక వైపు అంటున్నా ఇంకా ఆయనకు అది అలాగే ఉందని అంటున్నారు. శనివారం రాత్రి విజయవాడ సింగ్ రోడులో జగన్ మీద రాయితో జరిగిన దాడిని లైట్ గా విపక్షాలు ప్రచారం చేయడాన్ని వైసీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. కన్ను కానీ కణతల మీద కానీ రాయి తగిలితే ఏమి అయ్యేది అన్నది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించరా అని అంటున్నారు.

ఇదిలా ఉంటే రాయితో మనిషి చనిపోతాడా అది వట్టి గులకరాయి అని కూడా విపక్ష నేతలు అనడాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. పూర్వకాలంలో శత్రువుని చంపడానికి వడిసెలు విసిరే దానికి రాయి తగిలించి బలంగా కణతలకు గురి పెడుతూ కొట్టేవారని గుర్తు చేస్తున్నారు. అలా చేయడం వల్ల క్షణాలలో శత్రువు మృత్యువాత పడేవారు అని అంటున్నారు.

ఆధునిక యుగంలో కూడా అలాంటి ప్రయోగాలు చేసేవారు ట్రైనర్లు ఉన్నారని సరిగ్గా జగన్ కణతను గురి పెట్టి చేసిన దాడి ఇదని అంటున్నారు. పైగా ఇది హత్యాయత్నం అని కూడా మొదటి రోజు నుంచి వైసీపీ వాదిస్తోంది. నిజంగా చూస్తే జగన్ కి నుదిటి పై భాగాన జరిగింది కాబట్టి చిన్న రాయి అని అంటున్నారని కానీ అదే కణత మీద తగిలి ఉంటే ఇక చెప్పుకోవడానికి ఏమైనా ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక జగన్ విషయంలో రెక్కీ నిర్వహించి మరీ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. అది కూడా సురక్షితంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు, అదే సమయంలో భద్రతాపరంగా చర్యల నేపధ్యంలో కరెంట్ తీసేశారు అది కలసి వచ్చిందని అంటున్నారు. దుండగులకు జగన్ వెలుతురులో కనిపిస్తున్నారు అని అది వారికి అడ్వాంటేజ్ గా మారింది అని అంటున్నారు.

ఇక మావోల దాడులు ఇతర దాడులను వారి ఎత్తులను గమనించిన మాజీ పోలీసు అధికారులు నిపుణులు చెప్పేది ఏంటి అంటే ఇది జస్ట్ టెస్ట్ కోసం చేసిన దాడి అని అంటున్నారు. ఈ దాడిలో కేవలం గాయపరచడం దాని వల్ల వచ్చే పర్యవసానాలు గమనించడం, తమ గురికి ఉన్న పదును ఎంత తాము ప్రయోగించిన రాయికి ఉన్న పవర్ ఎంత ఇలాంటివి అన్నీ రిహార్సల్స్ గా చేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు.

ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదని ఆకతాయి చర్య అంతకంటే కాదని అంటున్నారు. అదే విధంగా దీని వెనక ఒక గ్యాంగ్ కూడా ఉండి ఉంటుందని వారిని ఈ చర్యకు ప్రేరేపించిన శక్తులు సూత్రధారులుగా ఉంటారని అంటున్నారు. దాంతో ఈ విషయాన్ని తేలికగా ఎవరూ తీసుకోకూడదని అంటున్నారు.ఇక విపక్షాలు సైతం ఈ ఇష్యూని తేలిక చేయడం వల్ల దుండగులకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు.

నేరం జరిగినపుడు అది నేరంగానే చూడాలని దాని మీద సమగ్ర దర్యాప్తు సాగనివ్వాలని అంటున్నారు. అలా కాకుండా లైట్ గా తీసుకుంటూ డ్రామా అంటూ విమర్శలు చేయడం వల్ల దుండగులకు తప్పించుకునే చాన్స్ ఇచ్చినట్లుగా అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర హోం శాఖ సీరియస్ గానే తీసుకున్నాయని అంటున్నారు.

ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రికి ఇస్తున్న భద్రత దాని వెనక జరుగుతున్న లోపాలను కూడా వారు గమనిస్తున్నట్లు గా చెబుతున్నారు. అదే విధంగా దాడి ఘటన పైన నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసిందని చెబుతున్నారు.

అదే విధంగా ఏపీ పోలీసుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. జగన్ కి భద్రతను పూర్తి స్థాయిలో పెంచాలని ఆదేశించింది. అదే విధంగా జగన్ బస చేసే నైట్ క్యాంప్‌కు సీఐఎస్ఎఫ్‌తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జగన్ బస చేస్తోన్న నైట్ క్యాంప్‌లకు ఆక్టోపస్ బలగాలు, పోలీసులను ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించనున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా కేంద్రం మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటూంటే ఏపీలో విపక్షాలు లైట్ తీస్కో అంటున్నాయి. మరో వైపు వైసీపీ శ్రేణులు అయితే భయపడుతున్నాయి. ఇక మీదట మరో నెల రోజుల పాటు జగన్ ఏపీలో తిరుగుతారని ఈ తరహా ఘటనలు ఇంకా ఏమైనా జరుగుతాయా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

ఇక దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవనెత్తుతూ సీఎం జగన్ కి హాని జరిగితే ఎవరికి లాభం అన్న అని సందేహం వెలిబుచ్చారు. న్యాయ పరిభాషలో దీన్ని మోటివ్ అంటారని, ఈ మోటివ్ ఎవరికి ఉంటుంది అని ప్రశ్నించారు.

ఇప్పటికే ఏపీలో తనకు గెలుపు ఆశలు సన్నగిల్లాయని భావిస్తున్న చంద్రబాబుకు మోటివ్ ఉందని ఎవరైనా ఠక్కున చెబుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతే కాదు తన కొడుకు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో జగన్ మీద కసి, కక్ష బాబు పెంచుకున్నారు అని ఆరోపించారు.

అందుకే జగన్ ని భౌతికంగా అంతం చేయాలన్న కుట్రపూరిత ఆలోచన బాబుకే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మొత్తం మీద చూస్తే ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఏమైనా జరుగుతుందా అన్నది మాత్రం చర్చగానే ఉంది.