Begin typing your search above and press return to search.

జగన్ చెప్పినట్లుగానే జనం.... తీర్పు తేడాగా వస్తుందా...?

దాదాపుగా రెండేళ్ల నుంచి జగన్ ఒక్కటే మాట అంటున్నారు. ఆయన జిల్లాలలో పెట్టే మీటింగ్స్ లో కూడా చెప్పేది ఒక్కటే. నా ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడాను చూడండి అని.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:30 AM GMT
జగన్ చెప్పినట్లుగానే జనం....  తీర్పు తేడాగా వస్తుందా...?
X

దాదాపుగా రెండేళ్ల నుంచి జగన్ ఒక్కటే మాట అంటున్నారు. ఆయన జిల్లాలలో పెట్టే మీటింగ్స్ లో కూడా చెప్పేది ఒక్కటే. నా ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడాను చూడండి అని. అదే బడ్జెట్, అంతే ఆదాయం కానీ నేను ఇన్నేసి పధకాలు మీకు ఇస్తున్నాను, అర్హులైన లబ్దిదారుల ఖాతాలలోకి నేరుగా రెండు లక్షల 35 వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కి మరీ జమ చేశానని విడమరచి చెబుతున్నారు.

మరి ఆనాడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి. ఇన్ని పధకాలు ఎందుకు లేవు అని జగన్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చెబితే జనాలకు గుర్తు ఉండకపోవచ్చు. అర్ధం కాకపోవచ్చు కూడా. కానీ జగన్ పదే పదే చెబుతున్నారు. ప్రతీ సభలో చెబుతున్నారు. ఆలోచించమని కోరుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అప్పులు కూడా చాలా తక్కువ చేసింది అని ఆయన అంటున్నారు. మరి ఇంతలా తాము చేయగలిగామని టీడీపీ ఎందుకు చేయలేకపోయింది అంటే వారిది దోచుకో దాచుకో పంచుకో విధానం అని జగన్ ఆరోపిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే ఈ పధకాలు మీకు అందుతాయని ఆయన అంటున్నారు. మంచి చేసే ప్రభుత్వం తనదని అన్నారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఉండబట్టే ఇన్ని పధకాలు ఏపీలో కనిపిస్తున్నాయని జగన్ అంటున్నారు.

ఒక విధంగా ఆయన స్పీచ్ ల ద్వారా ప్రజలలో ఆలోచనలు పెడుతున్నారు. చంద్రబాబు టైం లో ఈ పధకాలు ఎందుకు లేవు అన్న ప్రశ్నతో పాటు మళ్లీ వారికి చాన్స్ ఇస్తే పధకాలు ఉంటాయా అన్న ప్రశ్న కూడా వేసుకునేలా చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్న వేళ అంతా కలసి వస్తారు ఇంతకు ఎన్నో రెట్లు అబద్ధాలు చెబుతారు అని కూడా జగన్ హెచ్చరిస్తున్నారు. వారిని నమ్మవద్దు మీరు విపక్షాల మాటలే వినవద్దు అని సూచిస్తున్నారు.

ఒక్కటే కొలమానంగా పెట్టుకోమని అంటున్నారు. ప్రతీ లబ్దిదారుని ఇంట్లో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి కనిపిస్తేనే ఓటు వేయండి నాకు అండగా ఉండండి అని ఆయన అంటున్నారు. మీ కంటికి కనిపించేది చూడండి. మీ మనసు పెట్టి ఆలోచన చేయండి కచ్చితంగా తేడా అంటూ గత ప్రభుత్వానికి వైసీపీ సర్కార్ కి ఉంటేనే తన పక్షం ఉండాలని ఆయన పిలుపు ఇస్తున్నారు.

జగన్ ఇలాగే చెబుతున్నారు. ఇదే మాట అంటున్నారు. తనకు సైన్యం అయినా అండ అయినా దేవుళ్ళు అయినా పొత్తు అయినా మీడియా అయినా దత్తపుత్రుడు అయినా ప్రజలే అని ఆయన చెప్పేస్తున్నారు. తనకు వారికి మించి ఎవరూ లేరని అంటున్నారు. అందువల్ల ప్రజలే మంచి చెడు తేడా చూసి తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.

జగన్ చెప్పినది జనాలు ఆలోచిస్తారా. తేడా చూసి వారు తీర్పు చెబుతారా. అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి. 2024లో వారు ఎంచుకున్న ప్రయారిటీస్ ఏంటి, వారు పెట్టుకున్న కొలమానాలు ఏంటి ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పటికి అయితే జవాబు లేని ప్రశ్నలే. మీకు మేలు జరిగిందా లేదా అన్న కోలమానమే తీసుకోమని జగన్ అంటున్నారు.

అయితే ఇది ఎంతవరకూ జనాలు పట్టించుకుంటారు అని కూడా చర్చిస్తున్నారు. ప్రతీ అయిదేళ్ళకు మార్పు కోరుతూ తీర్పు ఇచ్చే వారూ ఉంటారు. అంతే కాదు ఒకసారి చాన్స్ ఇచ్చాం కదా మరోసారి ఇంకొకరికి అనుకున్న వారూ ఉంటారు. తమకు మేలు చేసినా కూడా ఓవరాల్ ఏపీ ప్రగతి గురించి ఆలోచించేవారూ ఉంటారు.

ఇక వీటితో పాటు ఏపీలో రాజకీయాలు మంత్రుల మాటలు వారి పనితీరు వీటిని కూడా చూసి ఓటేసేవారు ఉంటారు. ఇక ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. అలా కులం గోడలు దాటకుండా పడే ఓట్లు కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇక అభ్యర్ధుల విషయంలో కూడా ఎంచి ఓటు వేయడం జరుగుతుంది. ఆ దిశగా ఆలోచించాలి.

ఇవన్నీ ఆలోచిస్తే ఓటు అనేక కోణాల నుంచి వేసే వారు ఉంటారనే అంటున్నారు. అయితే జగన్ వ్యూహం వేరుగా ఉంది. తననే కేంద్ర బిందువుగా చేసుకుని తీర్పు ఇవ్వాలని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధి ఎవరని కానీ కులం మతం ప్రాంతం వర్గం వర్ణం ఇవన్నీ పక్కన పెట్టి తనకే ఓటేశామనుకుని వేస్తేనే మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అన్నది ఆయన ఆలోచన.

అంటే సెంట్రలైజెడ్ పాలిటిక్స్ తో పాటు నాయకుడి ఇమేజ్ తోనే ఈసారి ఎన్నికల్లో గెలవాలని అలా జనం మైండ్ సెట్ లో చేంజ్ తీసుకుని రావాలని చూస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే 2024 ఎన్నికల ఫలితాలు రావాల్సిందే.