Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులు బెంబేలు.. సీమ గడ్డపై జగన్‌ రణన్నినాదం!

ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 10:33 AM GMT
ప్రత్యర్థులు బెంబేలు.. సీమ గడ్డపై జగన్‌ రణన్నినాదం!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలను సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరోక్షంగా, ప్రత్యక్షంగా (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ.4.30 లక్షల కోట్లను రాష్ట్రంలో అర్హులైనవారందరికీ ఆయన అందజేశారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీ విజయం దక్కుతుందని విశ్వసిస్తున్నారు.

ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ సభకు రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలయిన అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు నుంచి లక్షల్లో ప్రజలు హాజరయ్యారు. మొత్తం నాలుగు జిల్లాల్లోని 52 నియోజకవర్గాల నుంచి వెల్లువలా జనం సిద్ధం సభకు తరలివచ్చారు. నేల ఈనిందా.. ఆకాశం పొంగిందా అన్నట్టు రాఫ్తాడు ఎటు చూసినా జన సముద్రాన్ని తలపించింది. ఎటు చూసినా దారులు జనాలతో నిండిపోయాయి. నలువైపులా దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు జననేతకు జన నీరాజనాలు పలికారు.

అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, యువత పెద్ద సంఖ్యలో సిద్ధం సభకు హాజరయ్యారు. దాదాపు పది లక్షల మంది హాజరయ్యారని అంటున్నారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో కొన్ని లక్షల మంది జనం రోడ్లపైనే నిలిచిపోయారు. రాప్తాడు వేదికగా జగన్‌ వచ్చే ఎన్నికల కోసం రణన్నినాదాన్ని మోగించారు.

తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే మరోసారి వైసీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. టీ గ్లాస్‌ (జనసేన గుర్తు) సింక్‌ లో ఉండాలని, సైకిల్‌ (టీడీపీ గుర్తు) బయట ఉండాలని, ఫ్యాన్‌ (వైసీపీ గుర్తు) ఇంట్లో ఉండాలని జగన్‌ చెప్పిన ప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

అలాగే చంద్రబాబును చంద్రముఖిగా వర్ణిస్తూ ఆయన చేసిన మోసాలను వివరించినప్పుడు సభకు హాజరైన ప్రజల నుంచి చప్పట్లు, విజిల్స్‌ పడ్డాయి. ఆయన ప్రసంగానికి, పంచ్‌ డైలాగులకు ప్రజలు ఫిదా అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, యువత ఉర్రూతలూగారు. జై జగన్, జైజై జగన్‌ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్, వైనాట్‌ 175 అంటూ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు.

వైసీపీకి కోర్‌ »ñ ల్ట్‌ అయిన రాయలసీమలో తాజా సభ ద్వారా ఆ పార్టీ తన పట్టును నిరూపించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో 52కి 52 అసెంబ్లీ స్థానాలు, 8కి 8 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమంటున్నారు.

సీఎం జగన్‌ తన ప్రసంగంలో చంద్రబాబు నలభయ్యేళ్ళ పాలనలో వైఫల్యాలు, మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వంటి విషయాలను చెబుతున్నప్పుడు ప్రజలు మంత్రముగ్థులై విన్నారు. సైకిల్‌ ను తోయడానికి ప్యాకేజీ స్టార్‌ ను చంద్రబాబు తెచ్చుకున్నాడని జగన్‌ వివరించారు.

వచ్చే ఎన్నికల్లో తాను అర్జునుడిలా నిలబడితే ప్రజలంతా కృష్ణుడిలా నిలబడి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మీ బిడ్డను మీరే గెలిపించుకోవాలంటూ ప్రజలతో మమేకమైన జగన్‌ తీరుకు ప్రజలంతా తమ చేతులెత్తి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరుల్లో సిద్ధం సభలను వైసీపీ నిర్వహించింది. ఆ సభలు కూడా ఏపీ చరిత్రలోనే అత్యధిక మంది హాజరయిన సభలుగా రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు రాప్తాడులో నిర్వహించిన సభకు ఏకంగా 10 లక్షల మంది హాజరవ్వడం నభూతో నభవిష్యత్‌ గా చెబుతున్నారు.

సిద్ధం సభల్లో జగన్‌ చేసిన ప్రసంగాలు వైసీపీ శ్రేణులకు మంచి బూస్టును ఇచ్చాయి. బూత్‌ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, వలంటీర్లు అంతా జగన్‌ ప్రసంగంతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్నారు. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్‌ చేసిన ప్రసంగం ఆద్యంతం అలరించింది. ఇది వారికి గొప్ప టానిక్‌ లా పనిచేస్తుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. రా కదలి రా పేరుతోనూ, నారా లోకేశ్‌.. శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్నా వాటికి వందల్లోనూ జనాలు హాజరుకాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. సిద్ధంలాంటి సభలను టీడీపీ తన చరిత్రలోనే నిర్వహించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఎల్లో మీడియా సిద్ధం సభలను తక్కువ చేయడానికి పడరాని పాట్లు పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ సభకు జనం రాలేదని ఒకసారి... భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ వాటంతటవే అయోమయానికి గురవుతున్నాయి.

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో... జగన్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఎల్లో మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యం అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం.. ఎల్లోమీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని కుండబద్దలు కొడుతున్నాయి.