Begin typing your search above and press return to search.

అంగన్వాడీలకు బిగ్ షాక్... జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:08 AM GMT
అంగన్వాడీలకు బిగ్  షాక్... జగన్  సర్కార్  కీలక నిర్ణయం!
X

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నట్లు కనిపిస్తున్న వీరి వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి కొరకురాని కొయ్యగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అగన్వాడీలు "చలో విజయవాడ" కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నలరోజులకు పైగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమ న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుతూ "చలో విజయవాడ" కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... అంగన్వాడీల తొలగింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది.

రోజు రోజుకీ అంగన్వాడీల సమ్మె ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అంగన్వాడీల తొలగింపు ప్రక్రియను ప్రత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు అధికారులు ఆదివారం రెండు వీడియో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో... తొలగింపు, నియామకం రెండు ఒకేసారి జరిగేలా కలెక్టర్లనే బాధ్యుల్ని చేసినట్టు సమాచారం!

ప్రభుత్వం ఎన్ని డెడ్ లైన్స్ విధించినా ఇప్పటికీ విధులకు హాజరుకాని కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, కృష్ణాజిల్లా కలెక్టర్‌ రాజా బాబు ఆదివారం ప్రకటనలు విడుదల చేశారు. ఇందులో భాగంగా... విధుల్లో చేరినవారు మినహా మిగతావారికి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో... ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఐసీడీఎస్‌ పీడీ తెలిపారు.

మరోపక్క... తమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు తలపెట్టిన "చలో విజయవాడ", సీఎం క్యాంప్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలకు పర్మిషన్స్ లేవని.. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా హెచ్చరించారు. ఇందులో భాగంగా... విజయవాడలో సెక్షన్‌ 144, 30 పోలీసు యాక్ట్‌ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని.. ఇప్పటికే అంగన్వాడీలపై ఎస్మా చట్టం వచ్చిందని వెల్లడించారు.