Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు జగన్‌ తో షర్మిల భేటీ!

ఆ తర్వాత రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్‌ జగన్, తన వదిన వైఎస్‌ భారతిలకు షర్మిల అందించారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 2:31 PM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు జగన్‌ తో షర్మిల భేటీ!
X

సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలిశారు. జనవరి 3 సాయంత్రం తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో సమావేశమయ్యారు. అంతకుముందు కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల కుటుంబ సభ్యులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్‌ జగన్, తన వదిన వైఎస్‌ భారతిలకు షర్మిల అందించారు.

తాడేపల్లికి షర్మిలతో పాటు వెళ్లినవారిలో ఆమె కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ ఉన్నారు. షర్మిలతోపాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారని చెబుతున్నారు.

కాగా వధూవరుల నిశ్చితార్థం, పెళ్లి తేదీలను వైఎస్‌ షర్మిల తన అన్న, వదినలకు వెల్లడించారు. ఈ రెండు కార్యక్రమాలకు రావాలని వారిని ఆహ్వానించారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

జగన్‌ నివాసంలో షర్మిల దాదాపు అరగంట పాటు ఉన్నట్లు సమాచారం. జగన్‌ దంపతులకు శుభలేఖను అందించిన తర్వాత షర్మిల ఢిల్లీకి బయలుదేరారు. జనవరి 4న ఆమె కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా వైఎస్‌ షర్మిల వెంట కడపకు వచ్చిన ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్‌ వద్దకు మాత్రం వెళ్లలేదు. కడప నుంచి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. షర్మిల వెంట జగన్‌ ఇంటికి విజయమ్మ కూడా వెళ్తుందని అందరూ భావించారు. అయితే, ఆమె అక్కడకు వెళ్లలేదు.

కాగా షర్మిల, జగన్‌ భేటీలో రాజకీయ పరమైన చర్చలేమీ జరగలేదని అంటున్నారు. కేవలం తన కుమారుడి పెళ్లి విషయం మాత్రమే ఆమె మాట్లాడరని చెబుతున్నారు.