Begin typing your search above and press return to search.

జగన్ మీద చెప్పు... భద్రతా వైఫల్యమేనా...!?

అక్కడ గాంధీ బొమ్మ జంక్షన్ వద్దకు సీఎం బస్సు ప్రవేశించగానే గుర్తు తెలియని ఒక వ్యక్తి సీఎం మీదకు చెప్పుతో దాడికి ప్రయత్నించడం కలకలం రేగింది.

By:  Tupaki Desk   |   30 March 2024 5:49 PM GMT
జగన్ మీద చెప్పు... భద్రతా వైఫల్యమేనా...!?
X

సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం మీదనే చెప్పుతో ఒక అగంతకుడు దాడి చేసిన ఘటన ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ గత నాలుగు రోజులుగా రాయలసీమ జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఆయన కర్నూలు జిల్లాలో తన పర్యటన ముగించుకుని అనంతపురం జిల్లా గుత్తి లోకి ప్రవేశించారు. అక్కడ గాంధీ బొమ్మ జంక్షన్ వద్దకు సీఎం బస్సు ప్రవేశించగానే గుర్తు తెలియని ఒక వ్యక్తి సీఎం మీదకు చెప్పుతో దాడికి ప్రయత్నించడం కలకలం రేగింది.

ఆ సమయంలో జగన్ బస్సు టాప్ పైన ఉంటూ తనకు ఎదురుగా ఉన్న జనాలకు అభివాదం చేస్తున్నారు. ఆ చెప్పు సీఎం కి కడు సమీపంలో పడింది. దాంతో అప్రమత్తం అయిన సీఎం పర్సనల్ సెక్యూరిటీతో పాటు పోలీసులు అంతా సీఎం ని రక్షణ వలయంలోకి తీసుకుని వచ్చారు సీఎం మీద ఏ వస్తువూ పడకుండా షీల్డ్ ని ముందుకు పెట్టారు.

అయితే ఈ ఘటన మాత్రం పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్ విషయంలో భద్రతాపరమైన వైఫల్యంగానే దీనిని చూస్తున్నారు. సీఎం భద్రత మీద ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. ఆయనకు పూర్తి సెక్యూరిటీ కల్పించాలని కొద్ది రోజుల క్రితం ఆ నివేదికలో స్పష్టం చేశాయి. అంతే కాదు సీఎం సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం పనికి రాదు అని కూడా సూచించాయి. దాని కోసమే సీఎం సెక్యూరిటీ అంటూ విజయవాడ, విశాఖ విమానాశ్రయాలలో రెండు హెలికాప్టర్లను కూడా లీజుకు తీసుకుని ఉంచాలని నిర్ణయించారు.

అయితే ఎన్నికలు చాలా దూరంలో ఉన్నందున జగన్ బస్సు యాత్రను ఎంచుకున్నారు. దీంతో ఆయన ఇపుడు బస్సులో నుంచే రోడ్ షోలు చేస్తూ జనాలకు బాగా చేరువ అవుతున్నారు. చాలా చోట్ల బస్సు దిగి మరీ జనంలోకి వస్తున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇదంతా గత నాలుగు రోజులుగా జరుగుతోంది.

అయితే జగన్ సెక్యూరిటీ విషయంలో ఇప్పటిదాకా లేని అనుమానాలు గుత్తి సంఘటనతో పెరిగిపోతున్నాయి. చెప్పుతో అగంతకుడు నేరుగా సీఎం ని టార్గెట్ చేయడంతో సీఎం భద్రతలోని డొల్లతనాన్ని అది తెలియచేస్తోంది అని అంటున్నారు. సాధారణంగా సీఎం పీఎం టూర్లు ఉంటే కనుక సివిల్ డ్రెస్ లో పోలీసులు జనం మధ్యలోనే ఉంటూ అన్ని వైపులా వాచ్ చేస్తూ ఉంటారు. మరి ఆగంతకుడు చెప్పుతో దాడి చేస్తున్నది ఎవరూ గుర్తించలేదా అన్న చర్చ సాగుతోంది.

ఇక్కడే మరో చర్చ సాగుతోంది. విసిరింది చెప్పు కాబట్టి సరిపోయింది. అదే వేరే మారణాయుధం విసిరితే ఏమవుతుంది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. దీనిని వైసీపీ వర్గాలు కూడా సీరియస్ గా తీసుకుంటున్నాయి. మరి సీఎం సెక్యూరిటీని ఈ ఘటన తరువాత మరింత కట్టుదిట్టం చేస్తారా లేదా అన్నది చూడాలి. అయితే ఇది సీఎం జగన్ మీద జనంలో ఉన్న నిరసన అని ప్రతిపక్షాలు అంటున్నాయి.