'మావిగన్'పై నోరు విప్పట్లేదే.. వీరి రూటేంటి?!
వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన మావిగన్(మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన రాజధాని) వ్యవహారంపై టీడీపీ మాత్రమే ఇప్పటి వరకు స్పందించింది.
By: Garuda Media | 9 July 2026 8:00 PM ISTవైసీపీ అధినేత జగన్ ప్రకటించిన మావిగన్(మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన రాజధాని) వ్యవహారంపై టీడీపీ మాత్రమే ఇప్పటి వరకు స్పందించింది. ఆ పార్టీనాయకులు మాత్రమే మావిగన్‌కు వ్యతిరేకంగా నోరు విప్పారు. ఇక, టీడీపీ బాటలోనే నడుస్తామని చెబుతున్న జనసేన ఈ విషయంపై స్పందించకపోయినా.. మావిగన్‌కు వ్యతిరేకమనే సంకేతాలు ఇస్తోంది. ఇక, ఈ కూటమిలోని మరో ప్రధాన పార్టీ బీజేపీ.. తటస్థ వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తోంది.
అధికార కూటమి పార్టీల వ్యవహారం పక్కన పెడితే.. ఆది నుంచి అమరావతికి మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సైతం మావిగన్ వ్యవహారంపై పెదవి విప్పకపోవడం గమనార్హం. మరి ఆ పార్టీల వ్యూహం ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. గతంలో అమరావతి రైతుల ఉద్య మానికి కమ్యూనిస్టులు పరోక్షంగా బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు అమరావతిని కూడాపూర్తి చేస్తామని చెప్పింది.
గతంలో ఒకటి రెండు సార్లు షర్మిల కూడా అమరావతి రైతుల పక్షాన గళం వినిపించారు. కానీ, ఇప్పుడు మావిగన్ ప్రకటన చేసిన 10 రోజులు గడుస్తున్నా.. అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నాయకులు ఎవరూ స్పందించకపోవడం.. ప్రభుత్వానికి అనుకూలంగా కానీ, రాజధానికి అనుకూలంగా కానీ ఒక్క కామెంటు కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో అసలు వారి ఉద్దేశం ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
ఈ వ్యవహారంలో రెండు రీజన్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1) జగన్‌తో కలిసి నడవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే జగన్ విషయంలో ఎవరూ పెదవి విప్పడం లేదు. 2) జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూడా.. అమరావతి సీఆర్ డీఏ పరిధిలోనే ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఏముంటుందని కొందరు చెబుతున్నారు. ఈ రెండు కారణాలే అడ్డు పడుతున్నాయా? లేక మరేమైనా ఉందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
