Begin typing your search above and press return to search.

సీఎం జగన్ రోడ్ షోలో కరెంట్ ఎందుకు లేదు?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ రోడ్ షోలో అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 April 2024 4:54 AM GMT
సీఎం జగన్ రోడ్ షోలో కరెంట్ ఎందుకు లేదు?
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ రోడ్ షోలో అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే. శనివారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా ఆయనపై రాయితో దాడి జరగటం.. ఈ సందర్భంగా నుదిటి మీద గాయం కావటం పెను సంచనలంగా మారింది. అయితే.. రాళ్ల దాడి జరిగిన వేళలో.. అక్కడ కరెంట్ లేకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తున్న వేళలో విద్యుత్ సరఫరాను ఎందుకు ఆపేశారు? అన్నది ప్రాథమిక ప్రశ్నగా మారింది.

దీనిపై క్లారిటీ వచ్చింది. విద్యుత్ సరఫరాను అధికారులు మందస్తు చర్యల్లో భాగంగా ఆపేసిన వైనం వెలుగు చూసింది. అయితే.. అందుకు వారు చెబుతున్న కారణం సబబుగా ఉంది. అయితే.. జగన్ భద్రతను పర్యవేక్షించే విభాగం.. ఈ రూట్ లో రోడ్ షో చేయటానికి ఎలా అనుమతించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రోడ్ షో రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన వైసీపీ నేతల అత్యుత్సాహమే దాడికి కారణంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాధారణంగా వీవీఐపీలు వెళ్లే మార్గాన్ని పోలీసులు ముందుగానే పరిశీలిస్తారు. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి ఎక్కడైనా పాల్గొంటున్నా.. రోడ్ షో చేస్తున్నా.. ముందు రోజునే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. దానికి రెండు రోజుల ముందు అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ లైజాన్ నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న తర్వాతే రూట్ మ్యాప్ ఖరారు చేస్తారు. ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని సరి చేస్తుంటారు.

తాజాగా దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలిస్తే.. రోడ్ షో జరిగిన సింగ్ నగర్ డాబా కొట్ల రోడ్ లో 33 కేవీ లైన్లు న్నాయి. అలాంటి దారిలో రోడ్ చేసేటప్పుడు.. అది బస్సు మీద నిలబడి వెళ్లటం ప్రమాదకరం. దీంతో ముందస్తుచర్యల్లో భాగంగానే అక్కడ విద్యుత్ సరఫరాను నిలివేసినట్లుగా తెలుస్తోంది. చిమ్మచీకటిగా ఉన్న వేళ.. దుండగులు రాళ్ల దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఈ వాదన ఇలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ఆఫీసు ఘటనాస్థలానికి దగ్గర్లో ఉండటం.. ఆ ప్రాంతంలో ఆయనకు విపరీతమైన పట్టు ఉండడటంతో.. తన సత్తా చాటేందుకు వీలుగా 33 కేవీ లైన్ ఉన్నప్పటికీ రోడ్ షోను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భద్రతా పరమైన చర్యలకు భిన్నంగా చీకట్లో సీఎం చేత రోడ్ షో ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయన్న అంశం చర్చకు వచ్చినప్పుడు.. అసలు ఆ రూట్లోనే రోడ్ షో చేయకూడదని.. అందుకు రూట్ మ్యాప్ ను ఖరారు చేయకూడదన్నది నిపుణుల మాటగా చెబుతున్నారు. సీఎం భద్రత ప్రశ్నార్థకంగా ఉండేలా రూట్ మ్యాప్ ను నేతలు ఖరారు చేస్తే.. పోలీసు అధికారులు.. నిఘా వర్గాలు ఎందుకు అనుమతించాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ వైఫల్యానికి.. ఈ ఘటనకు ఏ విభాగం బాధ్యత వహిస్తుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.