Begin typing your search above and press return to search.

ఏపీలో చీప్ లిక్కర్ పై వైఎస్ జగన్ వెర్షన్ ఇదే!

అవును... గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రధానంగా వినిపించిన ఫిర్యాదు మద్యం నాణ్యత గురించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 May 2024 5:20 PM IST
ఏపీలో చీప్  లిక్కర్  పై వైఎస్  జగన్  వెర్షన్  ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రధానంగా వినిపించిన ఆరోపణల్లో లిక్కర్ బ్రాండ్ల అంశం ప్రత్యేకం అనే చెప్పాలి. ప్రధానంగా ఏపీలో వినిపించిన బ్రాండ్ల పేర్లు గతంలో ఎప్పుడూ, ఎవరూ వినలేదనే కామెంట్లు వినిపించేవి. ఇదే సమయంలో... ఏపీలో దొరికే బ్రాందీ, విస్కీ, బీర్ల పేర్లపై ట్రోలింగ్స్ కూడా గట్టిగా జరిగేవి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జగన్ స్పందించిన సంగతి తెలిసిందే.

అవును... గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రధానంగా వినిపించిన ఫిర్యాదు మద్యం నాణ్యత గురించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా... ఏపీలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలోనూ పెద్ద దుమారమే లేవగా.. దీనిపై జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు కూడా.

ఏపీలో చీప్ లిక్కర్ వ్యవహారంపై ప్రశ్నించగా, జగన్ వ్యక్తిగత అభిప్రాయంతో కలిపి స్పందించారు. ఇందులో భాగంగా... తాను వ్యక్తిగతంగా మద్యం తాగనని.. ప్రజలు కూడా మద్యం సేవించాలని తాను కోరుకోనని తెలిపారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలో మద్య నియంత్రణ విధానానికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఏ విధంగానైనా దానిని అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఇలా 2019 ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్ధానానికే జగన్ 2024లోనూ కట్టుబడగా... తాను అధికారంలోకి వస్తే మాత్రం నాణ్యమైన మద్యాన్ని తక్కువధరకే అందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బలమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే విషయాలపై గతంలోనూ అసెంబ్లీలో స్పందించిన జగన్... గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు.