Begin typing your search above and press return to search.

జగన్ రెడ్ సిగ్నల్ : 68 మంది సిట్టింగులకు సీటు చిరుగుతోందా...?

వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక అసలు మొహమాటాలు లేవు అని గట్టి సందేశం ఇవ్వనున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 10:55 AM GMT
జగన్ రెడ్ సిగ్నల్ : 68 మంది సిట్టింగులకు సీటు చిరుగుతోందా...?
X

వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు అని ఒక ప్రచారం ఊపు అందుకుంది. ఇక అసలు మొహమాటాలు లేవు అని గట్టి సందేశం ఇవ్వనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో గెలిచి తీరాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఈసారి గెలుపే వైసీపీకి మేలి మలుపు అవుతుందని కూడా భావిస్తున్నారు.

తెలంగాణా ఎన్నికలు సరిగ్గా మూడు నాలుగు నెలల ముందు జగరడంతో వాటి ఫలితాలు కూడా జగన్ గుణపాఠంగా తీసుకుంటున్నారు. తెలంగాణాలో నూటికి తొంబై తొమ్మిది శాతం సిట్టింగులకు టికెట్ ఇచ్చి ఆ పార్టీ ఎలా చతికిలపడింది అన్నది అధ్యయనం చేస్తున్నారు. అలాగే కొత్త ముఖాలకు చోటు ఇచ్చిన చోట విజయం సాధించిన అనుభవం కూడా ఆయన గమనిస్తున్నారు.

దాంతో 2024 ఎన్నికలకు వైసీపీ నుంచి దాదాపుగా సగానికి సగం నియోజకవర్గాలలో కొత్త ముఖాలనే తీసుకుని రావాలని జగన్ పట్టుదలగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల కోట్ల నగదు గత అయిదేళ్ల కాలంలో జనం ఖాతాలోకి డైరెక్ట్ గా పడుతోంది. దాంతో ప్రజలు ప్రభుత్వం మీద సానుకూలంగానే ఉంటారన్నది జగన్ భావిస్తున్నారు.

అయితే స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కనుక ఉంటే విజయానికి అదే అతి పెద్ద ఆటంకంగా మారుతుందని జగన్ అంచనా కడుతున్నారు. దాంతో తెలంగాణా ఫలితాల తరువాత ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రుషితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు అని అంటున్నారు. గంటల తరబడి సాగిన ఈ భేటీలో ఐప్యాక్ సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ సీరియస్ గా చర్చించారు అని అంటున్నారు.

దీని ఫలితం ఏంటి అంటే ఏకంగా 68 దాకా ఎమ్మెల్యేలకు స్థాన చలనం తప్పదని అర్ధం అవుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఐప్యాక్ సర్వే నివేదికతో పాటుగా వైసీపీ కూడా తాను సొంతంగా పది దాకా సర్వేలు చేయించింది అని తెలుస్తోంది. వాటి మీద వచ్చిన నివేదికలు అన్నీ కూడా అధ్యయనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

దీని ప్రకారం చూస్తే ప్రజలలో ఆదరణ పూర్ గా ఉన్న వారిని పక్కన పెట్టాలనుకోవడం అలాగే ఒక మాదిరిగా ఆదరణ ఉన్న ఎమ్మెల్యేలకు వేరే సీట్లు ఇవ్వడం ద్వరా స్థాన చలనం కలిగించాలని, ఇక మరి కొంతమందిని ఎంపీలుగా పోటీ చేయించాలని అలాగే మరికొంతమందికి సీట్లు ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ లాంటి పదవులు కట్టబెడతామని చెప్పడం ద్వారా మొత్తం 68 దాకా సిట్టింగులకు సీటు అన్నది ఈసారి డౌట్ లో పెట్టేసారు అని అంటున్నారు.

ఇక ఐప్యాక్ ఇంచార్జి రుషితో సీఎం జరిపిన చర్చల పర్యవసానం ఏంటి అంటే చాలా చోట్ల మంత్రులకు కూడా టికెట్ హామీ ఉండదని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఒక మంత్రికి టికెట్ రాదు అని చెప్పేస్తున్నారు. అదే విధంగా కొన్ని జిల్లాలలో మాజీ మంత్రులలో కొందరికి టికెట్ దక్కడం కష్టమని తేలుతోంది అంటున్నారు. అదే విధంగా ఇంకొన్ని చోట్ల సీనియర్ నేతలు అయినప్పటికీ జనంలో కనుక సరైన ఆదరణ లేకపోతే నో అని చెప్పేయడమే అంటున్నారు.

ఇక వైసీపీ విపక్షాల కంటే ముందుగానే జనంలో ఉంది. ఎక్కువగా జనంలో వైసీపీ నేతలు,మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ప్రస్తుతం ఏపీ వై నీడ్స్ జగన్ కార్యక్రమం తో పాటు సామాజిక సాధికార బస్సు యాత్ర సాగుతోంది. ఇలా జనాలతో పాటు ప్రతీ ఇంటికీ వైసీపీ చేరువ అవుతోంది అని అంటున్నారు. ఆ టెంపోని కొనసాగించాలంటే మంచి అభ్యర్థులు బరిలోకి దిగితేనే అని అంటున్నారు.

దాంతో కచ్చితంగా గెలుపు గుర్రాలకే చాన్స్ అని వైసీపీ హై కమాండ్ యాక్షన్ బట్టి అర్ధం అవుతోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోమని చెబుతూ వస్తున్నారు. వారు కనుక ఆదరణ పొందకపోతే టికెట్ దక్కదని సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ చాలా మంది డేంజర్ జోన్ లోనే ఉన్నారని అంటున్నారు. దాంతో పార్టీని ఫణంగా పెట్టి వారికి టికెట్లు ఇవ్వడం కుదరదు అని అంటున్నారు.

అందుకే ఆయా చోట్ల కచ్చితంగా కొత్త ముఖాలను తెర మీదకు తీసుకుని వస్తారని చెబుతున్నారు. దీని వల్ల వైసీపీ వై నాట్ 175 అన్న స్లోగన్ ని పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే కాకుండా అత్యధిక సీట్లు సాధించి మరో మారు అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈసారి టికెట్లు దక్కవని భావిస్తున్న 68 అసెంబ్లీ నియోజకవర్గాలలో రోజూ వారీ సమీక్షలు నిర్వహించడం ద్వారా ఒక స్పష్టతను తీసుకురావడం, విజయావకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇవ్వడం అన్నది వైసీపీ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది. సో టికెట్లు ఎవరికి దక్కవు అన్నది ఇపుడు వైసీపీలో బిగ్ క్వశ్చన్ అయిపోయింది. అదే విధంగా వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో సుమారు 70 మంది అంటే సగానికి సగం లేచిపోతారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.