Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్డీయే - ఇండియా కూటమి మధ్యలో జగన్ ...!

ఏపీలో రెండు కూటములు ఏర్పడ్డాయి. ఈ రెండు కూటములలో కలసి పదికి దగ్గరలో పార్టీలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:00 AM GMT
ఏపీలో  ఎన్డీయే - ఇండియా కూటమి మధ్యలో జగన్ ...!
X

ఏపీలో రెండు కూటములు ఏర్పడ్డాయి. ఈ రెండు కూటములలో కలసి పదికి దగ్గరలో పార్టీలు ఉన్నాయి. దేశంలో ఎన్డీయే ఇండియా కూటములు జాతీయ స్థాయిలో పోరాడుతున్న వేళ ఎట్టకేలకు ఏపీలో కూడా ఏర్పాటు అయ్యాయి. అది రాజకీయ అనివార్యత.

ఏపీలో చూస్తే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. వీటితో బీజేపీ కలుస్తుంది కాబట్టి ఇది ఎన్డీయే కూటమి. ఇక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉంటుంది. ఆ కూటమిలో వామపక్షాలు జట్టు కాబట్టి ఏపీలో కూడా సీపీఐ సీపీఎం కలుస్తున్నాయి. ఇక ఆప్ బీఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ కూడా చేరుతాయని అంటున్నారు.

ఏపీలో రెండు కూటములు ఏర్పాటు అయినది వైసీపీకి వ్యతిరేకంగానే. ఆయన్ని ఓడించడానికే. మరి ఈ కూటముల వల్ల వైసీపీకి లాభమా నష్టమా అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉంటే అంత లాభమే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఏపీలో అలా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎన్డీయే కూటమి వచ్చింది. కానీ ఇండియా కూటమి కూడా ఇపుడు రంగంలోకి దిగడంతో ఓట్ల చీలిక అనివార్యం అని చెప్పాల్సి ఉంటుంది.

అదెలా ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి పడే ప్రతీ ఓటూ ప్రభుత్వం కావాలని కోరుకున్న వారిదే అవుతుంది. వద్దు ఈ ప్రభుత్వం అనుకున్న ప్రతీ ఓటూ విపక్ష శిబిరం వైపు రావాలి. అలా తీసుకుంటే టీడీపీ కూటమికి ఓట్లు టర్న్ కావాలి. కానీ ఇండియా కూటమి కూడా మరో వైపు ఉంటుంది. వారు కూడా అధికారంలోకి మేమే వస్తామని చెబుతారు. కాబట్టి ఆ వైపు ఉన్న బలంతో కొంత వారూ వ్యతిరేక ఓటు షేర్ ని తీసుకుంటారు.

అలా చూసుకుంటే ప్రభుత్వం కావాలి అనుకున్న ఓట్లు వద్దు అనుకున్న ఓట్ల కంటే తక్కువగా ఉన్నా ఓట్ల చీలిక వల్ల మరోసారి వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓట్ల చీలిక ఎంత మేరకు ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఏపీలో చూస్తే ఇండియా కూటమి కంటే ఎన్డీయే కూటమి బలంగా ఉంది. అక్కడ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్న టీడీపీ అలాగే పది నుంచి పన్నెండు శాతం ఓట్లు ఉన్న జనసేన వీరితో బీజేపీ ఉన్నాయి. అయితే ఈ మొత్తం కలిస్తే యాభై శాతానికి ఓటు షేర్ పెరగాలి.

కానీ కూటమి కట్టినపుడు అది జరగదు, అదే రాజకీయ మ్యాథమెటిక్స్ చిత్రం. విడివిడిగా ఓటు షేర్ వేరు. కలిస్తే వచ్చేది వేరు. పైగా 137 సీట్లలో జనసేన పోటీ చేస్తే ఆరు శాతం ఓటు షేర్ 2019లో వచ్చింది. ఇపుడు ఏ పాతిక సీట్లలో పోటీ చేస్తే వచ్చేది కూడా ఇంచుమించు అంతే ఉండవచ్చు. మరో వైపు జనసేన ఓటు షేర్ పెరిగినా టీడీపీ నుంచే ఎక్కువ షిఫ్ట్ అవుతూంటుంది. ఇపుడు టీడీపీ కలుస్తోంది కాబట్టి అది ఒక దగ్గర ఆగుతుంది.

ఈ నేపధ్యంలోనే చూస్తే ఎన్డీయే కూటమికి నలభై అయిదు శాతం దాకా ఓటు షేర్ రావచ్చు అని ఒక అంచనా. ఇక ఇండియా కూటమి తీసుకుంటే షర్మిల నాయకత్వం వహించాక కాంగ్రెస్ లో ఉత్సాహం వచ్చింది. ప్రతీ చోటా ఉన్న క్యాడర్ కదులుతోంది. ఎన్నికల్లో పోటీకి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు వామపక్షాలు కలుస్తున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వంటివి చేరితే కనుక అంతా కలసి కనీసంగా రెండు నుంచి మూడు శాతం ఓట్లను ఇండియా కూటమికి సాధించగలరు అన్న అంచనాలు ఇప్పటి వరకూ అయితే ఉన్నాయి.

ఇలా ఈ లెక్క తీసుకుంటే ఇదంతా వైసీపీ వ్యతిరేక ఓటుతో పాటు ఎన్డీయే వ్యతిరేక ఓటుగా కూడా చూడాల్సి ఉంటుంది. ఇక వైసీపీకి గత సారి యాభై శాతం ఓటు షేర్ వచ్చింది. ఈసారి అంతకంటే పెరుగుతుంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే యాంటీ ఇంకెంబెన్సీ వల్ల గరిష్టంగా నాలుగైదు శాతం ఓట్ షేర్ తగ్గినా ఇండియా కూటమి ప్రభావంతో ఆ ఓట్ల చీలిక వల్ల వైసీపీ ఒడ్డున పడే అవకాశాలు అయితే ఉంటాయి.

అదే అంతకు మించి అంటే వైసీపీ పాలన మీద దారుణంగా ప్రజా వ్యతిరేకత ఉంటే మాత్రం అపుడు ఇండియా కూటమి చీల్చిన ఓట్ల కంటే కూడా ఎన్డీయే కూటమికి పడే ఓట్లు ఎక్కువ అవుతాయి. దాంతో వైసీపీ ఓడే అవకాశాలు ఉంటాయి. మరి భయంకరమైన వ్యతిరేకత వైసీపీ కూటమికి ఉందా లేక ఒక స్థాయి వరకే అది ఉందా అన్న దానిని బట్టే ఇండియా కూటమి చీల్చే ఓట్ల వల్ల కలిగే లబ్ది ఎవరికి అన్నది తేలుతుంది.