Begin typing your search above and press return to search.

రెబెల్ ఎంపీ మీద యాక్షన్ లేదా జగన్...?

తనను గెలిపించిన పార్టీ అని కూడా చూడకుండా విపక్షాల కంటే దారుణంగా నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు ప్రవర్తిస్తున్నారు అని వైసీపీలో టాక్ ఉంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:18 PM GMT
రెబెల్ ఎంపీ మీద యాక్షన్ లేదా జగన్...?
X

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు ప్రతిపక్ష ఎంపీ కంటే కూడా తీవ్రంగానే వ్యవహరిస్తున్నారు అని వైసీపీలో చర్చ సాగుతోంది. తనను గెలిపించిన పార్టీ అని కూడా చూడకుండా విపక్షాల కంటే దారుణంగా నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు ప్రవర్తిస్తున్నారు అని వైసీపీలో టాక్ ఉంది.

రఘురామ జగన్ని పట్టుకుని వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలోనే నిందిస్తున్నారు. ఆయన ఢిల్లీలో రచ్చబండ పెట్టి గత నాలుగేళ్లలో వైసీపీని జగన్ని ఎంత బదనాం చేయాలో అంతా చేశారు. ఏపీలో టీడీపీ జనసేనలతో చేతులు కలిపి ఆ ప్రభుత్వమే వస్తుందని జోస్యాలు చెబుతున్నారు.

అయితే రఘురామ మీద అనర్హత వేయించి రాజకీయాలలో ఆరేళ్లలో ఆయన పోటీ చేయకుండా చేయించాలని మొదట్లో వైసీపీ వ్యూహరచన చేసింది. కరోనా పీక్స్ లో ఉన్న టైం లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఎంపీల బృందం అంతా ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళి మరీ లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు కూడా చేసింది.

ఆ ఫిర్యాదుకు మూడున్నరేళ్ళు దాటుతున్నా కూడా అతీ గతీ లేదు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ తెర వెనక మద్దతు ఇస్తున్నా ఒక్క ఎంపీని ఏమీ చేయలేకపోయారు అన్న బాధ అయితే ఉంది. బీజేపీ ఈ విషయంలో రఘురామను చూసీ చూడనట్లుగా వదిలేసింది అని అన్న వారూ ఉన్నారు.

నిజంగా నాడే సరైన డెసిషన్ తీసుకుంటే ఈ పాటికి నర్సాపురం పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నిక జరిగి కొత్త ఎంపీ వచ్చి ఉండేవారు. ఇక నర్సాపురం ఎంపీగా రఘురామ నెగ్గినా 2020 సంక్రాంతి పండుగ తప్ప గడచిన నాలుగేళ్ల కాలంలో ఓటేసిన చోట అడుగు పెట్టిన దాఖలాలు లేవు.

ఆయన ఏపీకి వస్తే అరెస్ట్ చేస్తారు అన్న ఆందోళంతో ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆ మధ్య అంటే రెండేళ్ల క్రితం ఆయన హైదరాబాద్ లో తన ఇంట్లో పుట్టిన రోజు వేడుక చేసుకుంటే ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఒక రాత్రి అంతా ఉంచారు. తనను కొట్టి హింసించారని రఘురామ ఆ తరువాత చేయాల్సిన రచ్చ అంతా చేశారు.

ఇదిలా ఉంటే జగన్ మీద పగపట్టినట్లుగా రఘురామ కేసుల మీద కేసులు వేస్తున్నారు జగన్ బెయిల్ ని రద్దు చేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారు. జగన్ కి ఎందుకు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు అంటూ ఆయన వేసిన పిటిషన్ ఉంది. ఇది విచారణకు కూడా ఈ శుక్రవారం రాబోతోంది.

ఏపీలో పధకాల పేరుతో ఆర్ధికంగా అవకతవకలు జరుగుతున్నాయని ఏపీ హైకోర్టులో రఘురామ కేసు వేశారు. దీని మీద జగన్ తో సహా మరో 41 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది.

ఇక జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ చాలా నిదానంగా సాగుతోంది అంటూ సుప్రీం కోర్టులో రఘురామ మరో కేసు వేశారు. ఇలా జగన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా కేసులు వేస్తూ ఇరుకున పెడుతూ విపక్షం వారితో రఘురామ చేతులు కలిపారని వైసీపీ నేతలు అంటున్నారు.

అయినా జగన్ ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోరని అంటున్న వారూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేల మీద జగన్ ఎకాఎకీన యాక్షన్ తీసుకుని వారిని సస్పెండ్ చేశారు.

మరి అదే విధంగా రఘురామ విషయంలో ఎందుకు చేయరని అంటున్న వారూ ఉన్నారు. మా పార్టీ అని వైసీపీని చెప్పుకుంటూ ఎన్నికల్లో ఓడిపోతుంది అని రఘురామ వెటకారంతో మాట్లాడుతూ వైసీపీ ఓడాలని ప్రతీ రోజూ మొక్కుతూంటే ఆయనను ఇంకా వైసీపీ ఎంపీ అని గుర్తించడం ఏంటి అని వైసీపీ నేతలు అంటున్నారు

మరి జగన్ ఆయన మీద యాక్షన్ ఎపుడు తీసుకుంటారు అంటే అదే చెప్పలేరని అంటున్నారు. మరో నాలుగు నెలలలో ఎంపీ సభ్యత్వం ముగుస్తుంది. ఇప్పటికే సమయం మించిపోయింది అంటున్నారు. అయినా సరే ఆయన మా పార్టీ కాదు అని చెప్పాల్సిన సమయం ఇదే అని అంటున్న వారూ వైసీపీలో ఉన్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.