Begin typing your search above and press return to search.

జగన్ కొత్త ట్విస్ట్... వారిలో ఆశలు పెంచుతున్న తాజా లెక్కలు!

ఇందులో భాగంగా... ఎమ్మెల్యే అభ్యర్థుల టిక్కెట్లు అన్నీ దాదాపు ఖరారైనట్లే అని.. మార్చాల్సినవి ఆల్ మోస్ట్ 99శాతం పూర్తయ్యాయని.. మహా అయితే ఇక ఒకటో, అరో ఉంటాయంటూ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:09 AM GMT
జగన్  కొత్త ట్విస్ట్... వారిలో ఆశలు పెంచుతున్న తాజా లెక్కలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పులు, చేర్పులు కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇటీవల జరిగిన వైసీపీ నేతల కీలక సమావేశంలో ఈ విషయంపై జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఎమ్మెల్యే అభ్యర్థుల టిక్కెట్లు అన్నీ దాదాపు ఖరారైనట్లే అని.. మార్చాల్సినవి ఆల్ మోస్ట్ 99శాతం పూర్తయ్యాయని.. మహా అయితే ఇక ఒకటో, అరో ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఈ లోపే మరో ట్విస్ట్ ఇస్తూ... 8వ జాబితాను విడుదల చేశారు.

అవును... తాజాగా రెండు లోక్ సభ, మూడు శాసన సభ స్థానల్లో మార్పులు, చేర్పులతో 8వ జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఇందులో భాగంగా... ఐదు నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను మార్చారు. ఇందులో భాగంగా... గుంటూరు ఎంపీ స్థానానికి కిలారి రోశయ్య, ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అంబటి మురళి, కందుకూరు బుర్రా మదుసూదన్ యాదవ్, జీ.డీ.నెల్లూరు జిల్లా కృపాలక్ష్మి లను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఈ మార్పు చేర్పులతో తెరపైకి వచ్చిన సరికొత్త చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉదాహరణకు... పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు.. అంబటి మురళిని ప్రకటించడంతో.. ఆ కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చినట్లయ్యిందనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు సత్తెనపల్లి మంగళగిరి ఆర్కే కి ఇచ్చి రాంబాబుకి షాకిస్తారా అనే కామెంట్లు కూడా తాజాగా తెరపైకి రావడం గమనార్హం.

ఇక కందుకూరు విషయానికొస్తే... ఈ నియోజకవర్గానికి రెండు వారాల లోపు క్రితమే కటారి అరవిందా యాదవ్ ని సమన్వయ కర్తగా నియమించారు. అయితే తాజాగా ఆమె స్థానంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు సమన్వయకర్తగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదే క్రమంలో గంగాధర్ నెల్లూరు జిల్లా విషయానికొస్తే... ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిని జనవరిలో చిత్తూరు లోక్ సభకు మార్చారు. అయితే ఆ విషయంలో నారాయణస్వామి కాస్త అసంతృప్తిగా ఉన్నారనో ఏమో కానీ.. అనంతరం ఆయనను గంగాధర్ నెల్లూరుకే పంపుతున్నట్లు తెలిపారు. అయితే... తాజాగా ఆయన స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు.

ఇక లోక్ సభ స్థానాల విషయానికొస్తే... ప్రధానంగా గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈనెల మొదటివారంలో నియమించారు. అయితే... తాజాగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో... గతకొన్ని రోజులుగా వస్తున్న కథనాలు నిజమవుతూ... ఒంగోలు లోక్‌ సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు!

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటికే 99శాతం పూర్తయ్యింది అన్నట్లుగా ప్రకటించిన ఒక్కరోజు లోనే.. జగన్ ఐదు స్థానాల్లో అభ్యర్థుల మార్పు చెర్పులు చేపట్టడంతో అసంతృప్తుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... ఏమో గుర్రం ఎగరావచ్చు అనే ఆశతో పలువురు అసంతృప్తులు ఎదురుచూసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.