Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కు సంబంధించి ఈ విషయాలు మీకు తెలుసా?

హైదరాబాద్ లో చదువుకునే వేళలో.. స్కూల్లోనూ.. కాలేజీలోనూ హైదరాబాద్ - రాయలసీమ అంటూ గ్రూపులు ఉండేవి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:47 AM GMT
సీఎం జగన్ కు సంబంధించి ఈ విషయాలు మీకు తెలుసా?
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంచనాలకు అందని రీతిలో రాజకీయ నిర్ణయాలు తీసుకోవటం.. అనుకున్నది సాధించటం కోసం ఎంతకైనా వెళ్లేందుకు వెనుకాడని మొండితనం జగన్ సొంతం. దేశం మొత్తాన్ని రిమోట్ తో కంట్రోల్ చేసే సోనియాను సైతం ఎదిరింది.. ఆమెకు సవాలు విసిరి మరీ పోరాడిన రేర్ క్వాలిటీ ఆయనలో కనిపిస్తుంది. తాను నమ్మిన దాని కోసం జైలుకు వెళ్లేందుకు.. జైల్లో నెలల తరబడి ఉండేందుకు సైతం వెనుకాడని మొండితనం ఆయన సొంతం. అలాంటి జగన్ ను అభమానిస్తూ.. ఆరాధించే వారు కోట్లల్లో ఉంటారు. అలాంటి వారిలో అత్యధికులకు ఆయనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు అస్సలు తెలీవు.

ఇప్పుడు అలాంటి ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను అమితంగా ఆరాధించే వారికి సైతం తెలియని కొన్ని విషయాల మీద ఫోకస్ చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వాటిల్లోకి వెళితే.. జగన్మోహన్ రెడ్డికి థియేటర్ లో సినిమాలు చూడటం చాలా ఇష్టం. అది కూడా భార్య భారతితో కలిసి చూడటాన్ని ఇష్టపడతారు. చివరకు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా థియేటర్లలో సినిమాలకు వెళ్లేవారు. నందమూరి బాలక్రిష్ణ ఆయన అభిమాన హీరో.. వైఎస్ మరణం తర్వాత నుంచి సినిమాలకు వెళ్లటం ఆపేసినట్లుగా చెబుతారు.

హైదరాబాద్ లో చదువుకునే వేళలో.. స్కూల్లోనూ.. కాలేజీలోనూ హైదరాబాద్ - రాయలసీమ అంటూ గ్రూపులు ఉండేవి. వారి మధ్య గొడవలు ఉండేవి. అయితే.. ఏ గ్రూపు లోకి ప్రత్యక్షంగా వెళ్లటం ఇష్టం లేని జగన్.. రాయలసీమ విద్యార్థి గ్రూపునకు మాత్రం తాను సపోర్టు ఇచ్చే వారని చెబుతారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో తేడా వచ్చి.. పార్టీని కాదని బయటకు వచ్చేసి.. సొంతంగా పార్టీని పెట్టటం ఒక ఎత్తు అయితే.. సవాలు చేసి మరీ.. బయటకు వచ్చిన జగన్ చివరకు రాష్ట్రానికి ముఖ్యమత్రి కావటం.. అది కూడా 50 శాతం ఓట్ల షేర్ తో విజయాన్ని సొంతం చేసుకోవటం విశేషం. గడిచిన యాభై ఏళ్లలో ఎవరూ ఇలాంటి విజయాన్ని సాధించలేదని చెబుతారు.

2012 కడప ఎంపీ స్థానానికి జరిగిన ఉప పోరులో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి 5.43 లక్షల ఓట్లు మెజార్టీతో గెలుపొందటం తెలిసిందే. అప్పట్లో ఈ భారీ మెజార్టీ దేశంలోనే టాప్ 3 మెజార్టీల్లో ఒకటిగా చెబుతారు. జగన్ కు.. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. అయితే.. 2018లో పాదయాత్రకు ముందు మటన్ బిర్యానీతో నడక కష్టమని చెప్పిన మీదట.. దాన్ని వదిలేసినట్లుగా చెబుతారు. ఆ టైంలోనే రైస్ తినటాన్ని పూర్తిగా తగ్గించేశారని.. కేవలం మటన్ కర్రీ తినటం షురూ చేశారని చెబుతారు.

ఇక.. తన తండ్రి వైఎస్ కు.. జగన్ కు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. అయితే.. 1996లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ కు గెలుపు కష్టమైంది. ఈ క్రమంలో తన తండ్రి విజయం సాధిస్తే.. తాను ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ వదిలేస్తానని మొక్కుకున్నారు. ఆ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో బయటపడ్డారు వైఎస్. అప్పటి నుంచి తనకెంతో ఇష్టమైన చికెన్ బిర్యానీని తినటం ఆపేశారు జగన్. పుష్కర కాలంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అంతేకాదు.. ఆయన ఎప్పుడూ పార్టీ కండువాను ధరించటం కనిపించదు.

అంతేనా.. పార్టీ ఆవిర్బావ దినోత్సవానికి కూడా ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లటం కనిపించదు. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా.. తర్వాతి రోజున తెల్లవారుజామున ఉదయం నాలుగున్నర గంటల కల్లా నిద్ర లేవటం అలవాటు. అంతేకాదు.. భార్య భారతితో కలిసి కాఫీ తాగుతూ పేపర్లను చదవటం ఇష్టంగా చెబుతారు. రోజుకు నాలుగైదుసార్లు కాఫీ తాగే అలవాటు జగన్ సొంతం. సాక్షి మీడియాను స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి రోజు రాత్రి వేళ తొమ్మిది గంటల వేళలో ఆ మీడియా సంస్థలోని ఎడిటోరియల్ ముఖ్యులతో క్రమం తప్పకుండా మాట్లాడుతుంటారని చెబుతారు.