Begin typing your search above and press return to search.

జగన్ పాలనకు జాతీయ గుర్తింపు... దేశంలోనే మూడో స్థానం!

జగన్ పాలనపై ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు.. విపక్షాల నుంచి వస్తున్న విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే

By:  Tupaki Desk   |   15 Feb 2024 8:16 AM GMT
జగన్ పాలనకు జాతీయ గుర్తింపు... దేశంలోనే మూడో స్థానం!
X

జగన్ పాలనపై ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు.. విపక్షాల నుంచి వస్తున్న విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా జాతీయ స్థాయిలో సైతం జగన్ ప్రభుత్వ పాలనపై ప్రశంసల జల్లులు కురిసాయి. దేశంమొత్తం మీద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని అభినందనలు అందుతున్నాయి. తాజాగా ఏపీలో ప్రజారంజక పాలన అద్భుతంగా ఉందంటూ "స్కోచ్" అవార్డులు వెల్లడించింది. ఇందులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది.


అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఏ ప్రభుత్వాలూ చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా గ్రామస్వరాజ్య స్థాపన దిశగా జగన్ చేపట్టిన... గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటివద్దకు రేషన్, పెన్షన్, విలేజ్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రం... ఇలాంటి అద్భుత విధానాలతో జగన్ సరికొత్త సంసికరణలు చేపట్టడాన్ని సదరు సంస్థ అభినందించింది.

ఈ క్రమంలో తాజాగా... ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసలు అందుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక "స్కోచ్ – స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ - 2023"లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ.. తాజాగా మూడో స్థానానికి ఎగబాకింది.

ప్రధానంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. ఇదే సమయంలో... గ్రామీణ పాలనలో సీఎం ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలుస్తుంది. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది.

దక్షిణాదిలో ఆంధ్ర ఒక్కటే!:

"స్కోచ్" సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు. ఈ క్రమంలో మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలవగా... తమిళనాడు, వెస్ట్ బెంగాళ్, కేరళ, బీహార్, మధ్య ప్రదేశ్ లు ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.