Begin typing your search above and press return to search.

బీసీలకు పెద్ద పీట... జగన్ మార్క్ వ్యూహం...!

వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపధ్యంలో విజయమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలకు తెర తీస్తోంది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:30 PM GMT
బీసీలకు పెద్ద పీట... జగన్ మార్క్ వ్యూహం...!
X

వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపధ్యంలో విజయమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలకు తెర తీస్తోంది. ఏపీలో మొత్తం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిలను మారుస్తూ వైసీపీ అధినాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం చూస్తే కొందరు సిట్టింగుల స్థానంలో కొత్తవారు వచ్చారు. మరి కొందరు సిట్టింగులను వేరే చోటుకు మార్చారు. ఇలా మార్పు చేర్పులతో విడుదలైన ఈ జాబితా వైసీపీలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశం అవుతోంది.


వైసీపీ అధికారికంగా ఈ జాబితాను మీడియా సమావేశం పెట్టి మరీ రిలీజ్ చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ జాబితాను విడుదల చేస్తూ పార్టీ గెలుపు వ్యూహాలలో భాగంగానే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ జాబితాలో చూసుకుంటే ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు బాలసాని కిరణ్ కుమార్, కొండెపి ఎస్సీ రిజర్వుడు మంత్రి ఆదిమూలపు సురేష్, వేమూరు (ఎసీఎ) వరికూటి అశోక్ బాబు, తాడికొండ (ఎస్సీ) మేకతోటి సుచరిత, సంతనూతలపాడు (ఎస్సీ) మేరుగు నాగార్జున, చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ విడదల రజని, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి గంజి చిరంజీవి, రేపల్లె డాక్టర్ ఈవూరు గణేష్, గాజువాక డాక్టర్ వరికూటి రామచంద్రరావు ఉన్నారు.

ఇందులో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగింది. అలాగే కొందరు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. మరి కొందరు ప్లేస్ లో కొత్త ముఖాలను తెచ్చారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇలా చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అదే టైం లో పార్టీలో వ్యతిరేకత ఉన్న వారిని సైతం పక్కన పెడుతున్నారని అంటున్నారు.

పనితీరే కొలమానంగా ఈ మార్పుచేర్పులు జరిగాయని అంటున్నారు. త్వరలోనే మరిన్ని మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉంటే దాదాపుగా యాభై అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ముఖాలు ఈసారి కనిపించే అవకాశం ఉంది అని అంతున్నరు. ఇక ప్రజలలో వ్యతిరేకత ఉన్న వారికి టికెట్లు ఇస్తే తెలంగాణాలో కేసీఆర్ దెబ్బ తిన్న తీరున ఇబ్బందులు వస్తాయని ముందే గుర్తించి అధినాయకత్వం ఈ మార్పుచేర్పులు చేసినట్లుగా చెబుతున్నారు.

దీంతో ప్రజామోదం లేని వారికి టికెట్లు దక్కవని స్పష్టం అయింది అంటున్నారు. ఇక ఇదే విషయం మీద వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో వేరే ఉద్దేశ్యాలు లేవని అన్నారు. మరోసారి వైసీపీ అత్యధిక సీట్లు సాధించాలన్నది అధినాయకత్వం ఆలోచన అని అన్నారు. ఆ దిశగానే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని అన్నారు. అంతే కాదు భవిష్యత్తులో కూడా మార్పులు ఉంటాయని సజ్జల స్పష్టం చేయడం విశేషం.

మొత్తానికి చూస్తే జగన్ చాలా దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో బీసీలు బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఈసారి ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. దాంతో వైసీపీలో భారీ మార్పులు తధ్యమని మాట గట్టిగా వినిపిస్తోంది.