Begin typing your search above and press return to search.

హాట్‌ టాపిక్‌.. విదేశాంగ మంత్రికి ఏపీ సీఎం జగన్‌ లేఖ!

అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 12:45 PM GMT
హాట్‌ టాపిక్‌.. విదేశాంగ మంత్రికి ఏపీ సీఎం జగన్‌ లేఖ!
X

ఇటీవల అమెరికాలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కందుల జాహ్నవి ఉదంతం హాట్‌ టాపిక్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె అమెరికాలోని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతోంది. అమెరికాలో జనవరి 23, 2023న రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్‌ వాహనం ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన వీడియో హాట్‌ టాపిక్‌ గా మారింది. పోలీస్‌ అధికారి వెకిలి నవ్వులు నవ్వుతూ.. జోక్స్‌ వేసుకుంటూ జాహ్నవి గురించి వ్యాఖ్యానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. మన నిరసనను అమెరికాకు తెలియజేయాలని కోరుతున్నారు.


ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. తప్పు చేసిన అమెరికన్‌ పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు.

ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో అమెరికాలోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌ లో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతోందని సీఎం జగన్‌ కేంద్ర విదేశాంగమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో జనవరి 23, 2023న అమెరికాలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్‌ వాహనం ఢీకొట్టి ప్రాణాపాయానికి గురైందని జగన్‌ విదేశాంగ మంత్రికి జై శంకర్‌ కు రాసిన లేఖలో గుర్తు చేశారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని, తెలుగు అసోసియేషన్‌ ను సంప్రదించి జాహ్నవి మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆమె స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.

తాజాగా కందుల జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న అమెరికా పోలీస్‌ అధికారి ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియో ఆవేదన కలిగించిందని జగన్‌ ఆ లేఖలో కేంద్ర విదేశాంగ మంత్రికి తెలిపారు. ఆ వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి పోలీస్‌ అధికారి మాట్లాడారన్నారు. నాన్‌ అమెరికన్ల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాల్సి ఉందన్నారు. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని విన్నవించారు.

భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా ఈ చర్యలు ఉండాలని కోరుకుంటున్నానని జగన్‌ లేఖలో తెలిపారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ను కోరారు. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని జగన్‌ కోరారు.

యూఎస్‌లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీయాలన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని జగన్‌ ఆకాంక్షించారు. భారతదేశంలోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలని విదేశాంగ మంత్రికి జగన్‌ తన లేఖలో విన్నవించారు. మీరు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.