అసెంబ్లీ లో వినబడని జగన్ గొంతుక...!
సభలో ఇతర మంత్రులు కూడా గత టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీలో ఈసారి ఎక్కడా మాట్లాడలేదు.
By: Tupaki Desk | 27 Sep 2023 3:19 PM GMTఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాలలో దాదాపుగా వైసీపీ నుంచి మంత్రులు కీలక నేతలు, ఎమ్మెల్యేలు అనేక అంశాల మీద ప్రసంగాలు చేశారు. టీడీపీ మొదటి రెండు రోజులూ సభకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా ఆందోళనలు చేసి సస్పెండ్ అయింది. ఆ తర్వాత సభకు రాకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
ఈసారి అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన్న రాజెనద్రనాధ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద ప్రసంగిస్తే మరో మంత్రి గుడివాడ అమరనాధ్ ఫైబర్ నెట్ స్కాం మీద మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడు అలైన్మెంట్ స్కాం అంటూ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సోదాహరణంగా స్కాం ఎలా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.
సభలో ఇతర మంత్రులు కూడా గత టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీలో ఈసారి ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ధాటీగా ఈ సభలో మాట్లాడుతారు అని ఊహించిన వారిని నిరాశే మిగిలింది. ఒక వైపు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, మరో వైపు టీడీపీ అవినీతి అంటూ సభలో మంత్రులు మాట్లాడారు, చివరిలో అయినా సీఎం గత అయిదేళ్లలో చంద్రబాబు హయాంలో స్కాములు చేశారని తీవ్ర విమర్శలు చేస్తారు అనుకుంటే ఆయన అసలు పెదవి విప్పలేదు.
తొలి రెండు రోజులు సీఎం జగన్ వైరల్ ఫీవర్ తోనే సభకు హాజరు అయ్యారని వార్తలు వినిపించాయి. దాంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు అనుకున్నారు. అయితే గడప గడపకు ఎమ్మెల్యేల పర్యటన మీద జగన్ సమీక్ష అయితే ఆ తరువాత తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు. దాంట్లో చాలా సేపు జగన్ మాట్లాడారు.
కానీ అసెంబ్లీలో మాత్రం మౌనముద్ర దాల్చడం అంతా విశేషంగా చూస్తున్నారు. తెలుగుదేశం వైసీపీకి అసలైన ప్రత్యర్థి, చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఈ సమయంలో మరింతగా ముఖ్యమంత్రి బాబు గురించి మాట్లాడుతారు అని అనుకున్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఆయన నాలుగున్నరేళ్ళ తమ ప్రభుత్వం విశేషాలను సాధించిన విజయాలను వివరిస్తారు అని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
మొత్తానికి అసెంబ్లీ సెషన్ అయితే ముగిసింది, సభ నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఇక శీతాకాల సమావేశాలు ఉంటాయో ఉండవో తెలియదు. అంటే 2024 మార్చిలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీట్ తోనే ఈసారి సభ పూర్తి అవుతుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితులలో ఇంతటి కీలకమైన సమావేశాలను జగన్ మంత్రులతోనే మాట్లాడించి ఊరుకోవడం వెనక వ్యూహం ఏంటి అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు.
చంద్రబాబు విషయంలో రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది అని టీడీపీ విమర్శిస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ఆ ఇష్యూని మరింతగా తీవ్రతరం చేయదలచుకోలేదని అందుకే మంత్రులతోనే అంతా చెప్పించారు అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ సీఎం జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్న సెషన్ బహుశా ఇదే అనుకోవాలని అంటున్నారు.