Begin typing your search above and press return to search.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ... జగన్ "మెగా" గుడ్ న్యూస్!

ఈ క్రమంలో... పాఠశాల విద్యాశాఖ, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 6,100 టీచర్‌ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:04 AM GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ... జగన్ మెగా గుడ్  న్యూస్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ - 2024కి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో... వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న ఐబీ సిలబస్‌ కు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అవును... ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా 6,100 పోస్టులతో "మెగా డీఎస్సీ - 2024" నోటిఫికేషన్‌ కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూ.. టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే క్రమంలో... గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది.

ఈ క్రమంలో... పాఠశాల విద్యాశాఖ, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 6,100 టీచర్‌ పోస్టుల్ని భర్తీ చేయనుంది. భారీ సంఖ్యలో రాబోతున్న ఈ ఉద్యోగార్థులకు వయో పరిమితి 42 ఏళ్లు కాగా... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో అయిదేళ్ల సడలింపు ఉండనుంది. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాల్లో 15 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకంటే ముందు 8 రోజుల పాటు డీఎస్సీ అర్హత కోసం టెట్‌ పరీక్ష నిర్వహిస్తారు!

ఇదే సమయంలో... డీఎస్సీతో పాటు అటవీ శాఖలో ఫారెస్టు రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలని నిర్ణయించిన మంత్రి మండలి... 500 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌-5 కార్యదర్శుల నియామకం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో రానుంది!

అదేవిధంగా... ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ సిలబస్‌) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉప్యాధ్యాయులకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది!

ఏది ఏమైనా... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉపాధ్యయ ఉద్యోగార్థులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్లే! ఫలితంగా సుమారు 6,100 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో చేరనున్నారు! కాగా... గతకొంతకాలంగా ఈ మెగా డీఎస్సీపై అటు ప్రతిపక్షాల నుంచి, ఇటు పలు సంఘాల నుంచి తీవ్ర డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే!

ఐబీతో ఏపీ చారిత్రక ఒప్పందం!

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ సిలబస్‌) ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం తాజాగా చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా... వచ్చే విద్యాసంవత్సరం నుంచి క్రమంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఐబీ కలిసి పనిచేయనుంది. ఈ విషయాలపై అటు ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా స్పందించారు.

ఇందులో భాగంగా... గవర్నమెంట్ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా... ఇది చాలా సంతోషకరమైన విషయం అని, తనకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు! ఈ క్రమంలో... ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై తాము నిబద్ధతతో పనిచేస్తామని.. విద్య ద్వారా ఉత్తమ, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

అనంతరం స్పందించిన జగన్... ఐబీని ఏపీ ప్రభుత్వ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తి ఇస్తోందని.. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని.. ఫస్ట్ క్లాస్ నుంచి ట్వల్త్ క్లాస్ వరకూ ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం సంతృప్తినిచ్చే కార్యక్రమమని తెలిపారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించడం అన్నది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.