Begin typing your search above and press return to search.

విమానంలో జగన్ పిక్ వైరల్... ట్రోలింగ్ ఎందుకంటే...?

కాదేదీ ట్రోలింగ్ కి అనర్హం అన్నట్లుగా ఇప్పుడు కాలం మారిపోయింది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 6:48 AM GMT
విమానంలో జగన్  పిక్  వైరల్... ట్రోలింగ్  ఎందుకంటే...?
X

కాదేదీ ట్రోలింగ్ కి అనర్హం అన్నట్లుగా ఇప్పుడు కాలం మారిపోయింది. ఇది రాజకీయ నాయకుల విషయంలో అయితే మరింత పీక్స్ లో ఉంటుంటుంది. ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ఏకి పారేస్తుంటారు.. నెట్టింట ట్రోల్స్ వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ విమానంలో ప్రయాణిస్తున్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. అసలు ఏమిటా పిక్, ఎందుకు ట్రోలింగ్ అనేది ఇప్పుడు చూద్దాం..!

అవును.. రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే వారి లెక్కే వేరుగా ఉంటుంది.. లైఫ్ స్టైల్ పూర్తి విభిన్నంగా ఉంటుంటుంది. ఇక ముఖ్యమంత్రి అయితే చెప్పే పనేలేదు. చుట్టూ భద్రత, విపరీతమైన ఫాలోయింగ్, మందీ మార్భలంతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇక జిల్లా దాటి వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేక విమానాలు, హెలీకాప్టర్లు అందుబాటులో ఉంటుంటాయి.

ఈ నేపథ్యంలోనే గత వైసీపీ పాలనలో సీఎంగా ఉన్న జగన్ కూడా ఈ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అవసరమైనప్పుడు, అనవసరమైనప్పుడు అనే విషయంలో ఎవరి దృక్కోణం వారికి ఉండొచ్చు కానీ.. జగన్ వీలైనంతవరకూ వాయు మార్గాన్నే ఎంచుకుంటున్నారని, పక్క జిల్లాలకు కూడా హెలీకాప్టర్ లోనే వెళ్తున్నారని.. రాష్ట్రం దాటితే ప్రత్యేక విమానమే అని అనేవారు!

వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా అప్పుడున్న భద్రతా కారణాలో, కంఫర్ట్ వ్యవహారమో, లేక అత్యవసర పరిస్థితో కానీ ప్రత్యేక విమానాలను ప్రిఫర్ చేస్తుంటారని అంటారు. అలాగే జగన్ కూడా వెళ్లి ఉండొచ్చు. అయితే.. ఆయన సీఎం కాకముందు ఎంపీగా ఉన్నప్పుడే కానీ, ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడే కానీ ఆయన రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణం చేసేవారనేది తెలిసిన విషయమే.

ఇదే సమయంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సాదారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సతీమణి భారతితో కలిసి విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో జగన్ సాధారణ విమానంలో ప్రయాణిస్తున్నారు.. పైగా వెనక సీటు అంటూ కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... విమానంలో వెనుక సీటు, ముందు సీటు అనే ఆలోచన చాలా సంకుచితమైనదే అవ్వొచ్చు. విషయం ఏమిటంటే... అది ఏటీఆర్ ఫ్లైట్.. ఇక ఫ్లైట్ లోకి ఎక్కడం దిగడం కూడా వెనుకవైపు నుంచే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ వెనుక సీటులో కూర్చుని ఉంటారు.. దానివల్ల ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచించి ఉంటారని తెలుస్తోంది.

అయితే ఈ విషయం తెలియకో, అంత అవగాహన లేకో కానీ... నిన్న మొన్నటివరకూ ప్రత్యేక విమానంలో తిరిగిన జగన్ ఈ రోజు సాధరణ విమానంలో చివరి సీటుకు పరిమితమైపోయారు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు పలువురు! అయితే విషయం తెలిసిన వాళ్లు మాత్రం ఇది ట్రోలింగ్ చేసే విషయం కాదని నొక్కి చెబుతున్నారు. ఏది ఏమైనా... ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.