Begin typing your search above and press return to search.

మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ క‌ట్టిండి: జ‌గ‌న్‌

''కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నాం'' అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించా రు.

By:  Tupaki Desk   |   30 March 2024 12:30 AM GMT
మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ క‌ట్టిండి: జ‌గ‌న్‌
X

మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎమ్మిగనూరు సభలో ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నెరవేర్చామ‌న్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకొచ్చామ‌ని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3 వేల పెన్షన్ ఇంటికే పంపిస్తున్నామ‌ని తెలిపారు. రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటేన‌ని తెలిపారు. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నానన్నారు.

''మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని చెబుతున్నాయి. మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా'' అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

వైసీపీ పాల‌న‌లో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జ‌గ‌న్ చెప్పారు. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. ''విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా'' అని జ‌గ‌న్‌ ప్రశ్నించారు. ధనికులకు అందే చదువునే పేదలకు కూడా అందిస్తున్నామన్నారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదని వ్యాఖ్యానించారు.

కూట‌మితో కుట్ర‌లు

''కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నాం'' అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్న వారికి .. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయాలన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించాలన్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నవారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

ద‌త్త‌పుత్రుడు- మోడీ

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ''ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకున్నాడు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయి. మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు. ‘2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?'' అని జగన్ ప్రశ్నించారు.

''ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్‌ సిక్స్‌ అంటూ వస్తున్నాడు. ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి'' అని సీఎం జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు.