Begin typing your search above and press return to search.

ఇండియాటుడే సమిట్ లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇంతకు సీఎం జగన్ ఏమన్నారు? ఆయన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:04 AM IST
ఇండియాటుడే సమిట్ లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు? ఆయన మనసులో ఏముంది? తన సోదరి షర్మిల వ్యాఖ్యలపై ఆయన రియాక్షన్ ఏమిటి? అసలు తనపై కాంగ్రెస్ సంధించిన తన సోదరి ఎపిసోడ్ పై ఇప్పటివరకు జగన్ స్పందించింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఒక వేదిక నుంచి ఆయన కీలక వ్యాఖ్యలు చేయటమే కాదు.. తన మనసులోని భావాల్ని స్పష్టంగా.. సూటిగా చెప్పేశారు. ఇందుకు ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ సమిట్ వేదికైంది. ఇంతకు సీఎం జగన్ ఏమన్నారు? ఆయన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నాకు ఎలాంటి విచారమూ లేదు. నాకెంతో సంతోషం. 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా.. చిత్తశుద్ధితో పని చేశా. కోట్ల మంది ప్రజలకు సహాయాన్ని అందించటం నాకెంతో సంత్రప్తిని ఇచ్చింది.

- ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నాకెలాంటి విచారమూ లేదు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని.. చెప్పిన పనుల్ని చేశాం. మ్యానిఫెస్టోలో 90 శాతం అమలు చేశాం. మా మ్యానిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించి మేం చేశామని చెప్పి ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాం.

- కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. విభజించి పాలించటమే ఆ పార్టీ విధానం. రాష్ట్రాన్ని అలాగే అన్యాయంగా విభజించింది. నేను ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మా బాబాయ్ కు మంత్రి పదవిని ఇచ్చి మాపైనే పోటీకి నిలిపింది. తర్వాత కూడా ఆ పార్టీ పాఠాలు నేర్చుకోలేదు.

- ఇప్పుడు మరోసారి మా కుటుంబాన్ని విడదీసి నా సోదరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించింది. వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే. కాంగ్రెస్ లేదా మరే పార్టీ అయినా దేవుడు అనే గొప్ప శక్తి ఉందనేది మర్చిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించకతప్పదు.

- కేంద్రంలో సత్ సంబంధాలు రాష్ట్రానికి అవసరం. ఆ గీతను మేం కొనసాగిస్తూ వచ్చాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చాం.

- అభ్యర్థుల మార్పు ఎందుకన్న ప్రశ్నకు స్పందిస్తూ..ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుంది. వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుంది. మేం ప్రజలకు మేలు చేశాం. దీంతో మా ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందని మా సర్వేల్లో తేలింది. కొందరు నేతల తీరు.. వారు ప్రజలతో మమేకం కాకపోవటం.. వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. సామాజిక.. రాజకీయ సమీకరణలు ఇలా అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళుతున్నాం.

- ఎన్నికలకు ఇంకా 70-80 రోజులే ఉన్నాయి. అందుకే ఎన్నికలకు ముందు సీట్లు మార్చి గందరగోళం చేసుకోవటం ఎందుకని.. ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాం. దీని వల్ల ఎదురయ్యే గందరగోళాలు సమిసిపోతాయని ఇప్పుడే చేస్తున్నాం.

- ఏపీలో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలకు ఉనికి లేదు. మా పోటీ టీడీపీ.. ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన.. వారితో కలిసి వచ్చే వారితోనే. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే కేసు నమోదైంది. అంతే తప్పించి సీఐడీ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసిందేమీ లేదు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టి ఉంటే కోర్టుల్లో నిలబడవు కదా?