Begin typing your search above and press return to search.

బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన జగన్ ...!

ఆ బ్రహ్మాస్త్రం పేరు ఆరోగ్యశ్రీ. జగన్ తాజాగా ఆరోగ్యశ్రీ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 1:30 AM GMT
బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన జగన్ ...!
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రహ్మాస్త్రాన్ని అమ్ముల పొది నుంచి బయటకు తీశారు. అది రామబాణంలా తిరుగులేనిది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో జగన్ నెగ్గేందుకు అనేక పధకాలు ఉండగా ఇది వాటన్నిటిని ఒక వైపు పెడితే అంతటి స్థాయిలో సరితూగేది అని అంటున్నారు. ఆ బ్రహ్మాస్త్రం పేరు ఆరోగ్యశ్రీ. జగన్ తాజాగా ఆరోగ్యశ్రీ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద అయిదు నుంచి పది లక్షల లోపు ఖర్చుతో కూడిన రోగాలకే ఉచిత వైద్యం ఉండేది. దాన్ని ఒక్కసారిగా అనేక రెట్లు జగన్ పెంచేశారు. ఏకంగా పాతిక లక్షల రూపాయల వరకూ ఖర్చు అయ్యే రోగాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేలా జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 18న ఈ పధకాన్ని జగన్ ప్రారంభిస్తారు. పాతిక లక్షల రూపాయల మేర ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను ఈ నెల 19 నుంచి ప్రతీ ఇంటికీ పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ఏపీలో సాగనుంది. ఇది జనవరి దాకా కొనసాగనుంది.

ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు అంతా పాల్గొంటారు. ప్రతీ ఇంటికీ వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు రూపంలో ఏకంగా ఆరోగ్య వరమే జగన్ అందించబోతున్నారు. నిజంగా చూస్తే ఈ రోజులలో పెద్ద రోగాలు ఎన్నో పేదవారికి వస్తున్నాయి. ప్రతీ రోగానికి అయ్యే వైద్యం ఖర్చు లక్షలలో ఉంటోంది. దాంతో రోగానికి బలి అవుతున్న వారే ఎక్కువ.

ఇక కరోనా తరువాత వింత రోగాలు కొత్త వ్యాధులు అధికమవుతూ సామాన్యుడి జీవితానికి సవాల్ చేస్తున్న నేపధ్యం ఉంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను ఏకంగా పాతిక లక్షల రూపాయల పరిమితితో జగన్ రిలీజ్ చేయడం అంటే నిజంగా పేదవాడికి ఇంతకంటే మహా భాగ్యం వేరేది లేదు అని అంటున్నారు.

ఆరోగ్యం విద్య ప్రతీ ఒక్కరి హక్కు అందరి కంటే పేదల హక్కు అని జగన్ సమీక్షలో అనడం బట్టి చూస్తే జగన్ ప్రభుత్వం ఎన్నికల అజెండా తెలిసిపోతోంది. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అన్నీ ప్రతీ ఇంటికీ పంపిణీ చేస్తే అంతకంటే గొప్ప ఎన్నికల మేనిఫెస్టో కూడా ఏదీ ఏ రాజకీయ పార్టీ వద్ద కూడా ఉండదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఆరోగ్యశ్రీతో జగన్ జనం వద్దకు వస్తున్నారు. ప్రాణం విలువ ఎపుడూ ఆపద కాలంలోనే తెలుస్తుంది ఆరోగ్యశ్రీ పధకానికి రూపకల్పన చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వైఎస్సార్ జనం గుండెలల్లో ఎప్పటికీ ఒక దేవుడిగా మిగిలిపోయారు. దేశంలో దీనికి సరి సాటి పధకం కూడా వేరొకటి లేనే లేదు.

ఎందుకంటే ఎవరికైనా ప్రాణం కంటే విలువ అయినది వేరొకటి ఉండబోదు కాబట్టి. అలాంటి ప్రాణానికి ఆరోగ్యానికీ భరోసా ఇస్తూ జగన్ ఇస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతీ ఇంటిలో పేదవారికి అభయ హస్తంగా ఉంటాయి. మరి వచ్చే ఎన్నికల వేళ వైసీపీకి ఇది వ్రజాయుధంగా కాపాడుతుంది అన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి.