Begin typing your search above and press return to search.

బొత్సకు పెద్ద పీట వేసిన జగన్ !

ఉత్తరాంధ్రాలో బీసీ నేత అంటే బొత్స సత్యనారాయణ పేరునే చెబుతారు.

By:  Tupaki Desk   |   25 April 2024 3:40 AM GMT
బొత్సకు పెద్ద పీట వేసిన జగన్ !
X

ఉత్తరాంధ్రాలో బీసీ నేత అంటే బొత్స సత్యనారాయణ పేరునే చెబుతారు. ఆయన దశాబ్దాల పాటు రాజకీయం చేస్తున్నారు. బొత్స మొదట కాంగ్రెస్ నుంచి రాజకీయం మొదలెట్టి వైసీపీలో కీలకంగా మారారు. తాజాగా జరిగిన విజయనగరం జిల్లా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొత్సను సభకు పరిచయం చేస్తూ తనకు తండ్రి సమానుడు అని అన్నారు.

దాంతో బొత్స ఒకింత ఎమోషన్ అయ్యారు. బొత్స మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. అపుడు జగన్ కాంగ్రెస్ తో విభేదించారు. ఆ సమయంలో వైఎస్సార్ కుటుంబాన్ని బొత్స పీసీసీ చీఫ్ గా విమర్శలు చేశారు. అవి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అప్పట్లో అవి చర్చకు కూడా వచ్చాయి.

ఇవన్నీ పక్కన పెడితే 2014 ఎన్నికలలో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన వైసీపీలోకి రావాలని అప్పట్లో చూసినా కుదరలేదు అని ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లకు గానూ వైసీపీ కేవలం మూడు సీట్లనే గెలుచుకుంది. అందులో ఆ మూడూ కూడా ఎస్టీ సీట్లు కావడం విశేషం.

జనరల్ సీట్లలో వైసీపీ దారుణంగా ఓడింది. ఆ తరువాత బొత్సను వైసీపీలోకి ఆహ్వానించారు. 2019లో అయితే విజయనగరం ఎంపీ సీటుతో పాటు మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. దాని వెనక బొత్స కృషి ఉంది. అప్పటి నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బొత్స సతీమణికి విశాఖ ఎంపీ సీటు కూడా వైసీపీ ఇచ్చింది.

ఇపుడు బొత్సను ఉత్తరాంధ్రాలో బీసీల నుంచి ప్రతినిధిగా చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కి ఉత్తరాంధ్రాలో అడుగుపెట్టే హక్కు లేనే లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బొత్స కౌంటర్ ఇచ్చారు.

ఉత్తరాంధ్రా మూలవాసులము మేము. ఉత్తరాంధ్రాలో పుట్టి పెరిగాం, మాది ఈ నేల ఉత్తరాంధ్రా ఎవరు రావాలో వద్దో చెప్పే హక్కు బాబుకు ఎక్కడ ఉంది అని నిలదీశారు. ఉత్తరాంధ్రా ఏమైనా ఆయన జాగీరా అని బొత్స మండిపడ్డారు. విశాఖ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్రా వెనకబాటుతనాన్ని మేము రూపుమాపదలచుకున్నాం. దీనికి మోకాలడ్డుతున్న చంద్రబాబే ఉత్తరాంధ్రాకు అన్యాయం చేశారు అని బొత్స ఫైర్ అయ్యారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అంటున్నారు. ఇప్పటికైనా విశాఖ రాజధానికి బాబు అంగీకరించాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టి చూస్తూంటే బీసీ ఫేస్ ని ముందు పెట్టి జగన్ టీడీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీకి ఉత్తరాంధ్రాలో చాలామంది బీసీ నేతలు ఉన్నారు. అదే వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి నాయకులు ఉన్నా వారు ఎవరి పరిధి మేరకు అన్నట్లుగా ఉంటున్నారు. దాంతో జగన్ బొత్సకు పెద్ద పీట వేస్తున్నారు అని అంటున్నారు.

రానున్న కాలంలో మరోసారి గెలిస్తే కనుక విశాఖను రాజధానిగా చేసుకుని పాలించాలని ఆశిస్తున్న వైసీపీకి బొత్స వంటి బీసీ నేతను ముందుంచడం కూడా అనివార్యంగా ఉంది అని అంటున్నారు. బీసీల ఖిల్లాగా చెప్పుకునే ఉత్తరాంధ్రాలో పట్టు సాధించాలంటే బీసీల నేతలనే ముందుంచాలి అన్న రాజనీతిని టీడీపీని చూసే వైసీపీ అమలు చేస్తోంది అని అంటున్నారు.

అందుకే బొత్స మీడియా ముందుకు వచ్చి మా ఉత్తరాంధ్రా అంటున్నారు. మా ప్రజలు మా మనోభావాలు అని అంటున్నారు. మేము దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తున్నాం, మేము ప్రజలకు మంచి చేయగలమని టీడీపీ అధినాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. బీసీలను ముందు పెట్టి వైసీపీ టీడీపీ ఆడుతున్న ఉత్తరాంధ్రా రాజకీయ క్రీడలో పై చేయి ఎవరిదో చూడాలి మరి.