Begin typing your search above and press return to search.

ప్రజా సం"క్షేమం": జగనన్న ఆరోగ్య సురక్ష ఇప్పటివరకూ చేసిన అద్భుతాలివే!

ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది. ఫలితంగా జగన్ తో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విభేదించేవారు, విమర్శించేవారు సైతం... అభినందించకుండా ఉండలేకపోతున్నారని అంటున్నారు!

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:26 AM GMT
ప్రజా సంక్షేమం:  జగనన్న ఆరోగ్య సురక్ష ఇప్పటివరకూ చేసిన అద్భుతాలివే!
X

నిన్నమొన్నటివరకూ ఒకలెక్క.. ఇప్పుడు మరోలెక్క.. ప్రజాసం"క్షేమం" విషయంలో తనదైన పాలన అందిస్తున్న జగన్... రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పాన్ని కలిగి ఉన్నారనే విషయం చేతల్లో తేటతెల్లమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని బలంగా కంకణం కట్టుకున్నారు. ఫలితంగా... పేదలు, వృద్ధులు, వికలాంగులు, ఇల్లు కదల్లేనివాళ్ళు, వీళ్ళందరికీ ఎవరు వైద్యం చేస్తారు.. ఎవరు చికిత్స చేస్తారు.. అనే ప్రశ్నలకు తావులేకుండా చేస్తున్నారు.

అవును... దైన్యంలో ఉన్నవారికి వైద్యం ఎవరు చేస్తారు.. వాళ్ళను ఎవరు పట్టించుకుంటారు.. ఎవరూ తోడులేనివారికి దేవుడే దిక్కు అంటారు! అయితే ఇప్పుడు ఆ దిక్కు జగన్ అయ్యారు! ఇందులో భాగంగా... తన ప్రతినిధులుగా ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపిస్తున్నారు. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇచ్చి, అవసరం ఐతే పెద్ద ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం ఇన్ని రోజులుగా కోట్లాదిమందికి సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది. ఫలితంగా జగన్ తో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విభేదించేవారు, విమర్శించేవారు సైతం... అభినందించకుండా ఉండలేకపోతున్నారని అంటున్నారు!

వేలల్లో వైద్య శిబిరాలు.. లక్షల్లో చికిత్సలు:

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,000 వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59.2 లక్షల మందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు. ఇదే క్రమంలో... ఇప్పటివరకూ 1.44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3.78 కోట్లమందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు.

అదేవిధంగా... ఇక 1.38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా... ఇంటింటికీ వైద్యం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అందరి ఇళ్లలో ఆరోగ్యం రూపంలో నిలిచారని అంటున్నారు ప్రజలు, పరిశీలకులు.

చిన్నారుల ఆరోగ్యానికి జగన్ రక్ష:

2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ లో పిల్లల కోసం నిలోఫర్‌ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఆ ఆస్పత్రి సేవలను కోల్పోయింది! దీంతో రాష్ట్రంలోని పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది! ఈ సమయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా చర్యలు చేపడుతోంది.

అవును... రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసానిచ్చేలా సీఎం జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా... విజయవాడ, విశాఖపట్నంలో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ప్రభుత్వానికి పంపింది.

ఇదే సమయంలో... టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది. ఈ ఆస్పత్రి ప్రస్తుతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. అదేవిధంగా... అలిపిరి వద్ద రూ.450 కోట్లతో పీడియాట్రిక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని టీటీడీ సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నారు.

ఈ తరహాలోనే విజయవాడ, విశాఖపట్నంలోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో... 500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ఏర్పాటుకు డీఎంఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో గుండె, కిడ్నీ, మెదడు, కాలేయ సంబంధిత జబ్బులతో పాటు.. చిన్న పిల్లల్లో క్యాన్సర్‌ కు వైద్య సేవలు అందించేలా 17 స్పెషాలిటీలు, సూపర్‌ స్పెషాలిటీలతో ఈ రెండు ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి.